ఎమ్మెల్యే జోగురామన్నకు చికాకు తెప్పిస్తున్న కొత్త చిక్కేంటి?

Update: 2020-06-17 11:40 GMT

మాటల్లేవ్....మాట్లాడుకోవడాల్లేవ్.. దబిడి దిబిడే. ఆదిలాబాద్‌ జిల్లా గులాబీదళంలో పదునెక్కుతున్న కత్తుల కవాతు ఇది. మాటకు మాట. వేటకు వేట. పోటుకు పోటు. పన్నుకు పన్ను చందంగా కారు పార్టీలో కయ్యం నడుస్తోందక్కడ. సొంత పార్టీ నేతలే, తన చుట్టూ గోతులు తీస్తున్నారని, ఓ మాజీ మంత్రి రగిలిపోతుంటే, తాము చేసిన అభివృద్ది పనులకు, మళ్లీమళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారంటూ, టీఆర్‌ఎస్‌ నేతలే రుసరుసలాడుతున్నారట. ఇంతకీ ఆదిలాబాద్‌ గులాబీవనంలో, గుచ్చుకుంటున్న ముల్లేంటి? మాజీ మంత్రి ఎందుకంతగా ఫైరవుతున్నారు?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గులాబీలో కోల్డ్‌వార్‌ కుంపట్లు అంతకంతకూ మండుతున్నాయి. మంత్రి వర్సెస్ మాజీ మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, ఎంపిటీసీ, మున్సిపల్‌ సంస్థల సారథుల మధ్య కూడా గొడవలు పతాకస్థాయికి చేరుతున్నాయి. అసలే తన మంత్రి పదవి మరెవరో తన్నుకుపోయారని రగిలిపోతున్న జోగురామన్న, తన చుట్టూ సొంత పార్టీ నేతలు గోతులు తవ్వుతున్నారంటూ ఫైర్‌ విల్‌ బి ఫైర్‌ అన్నట్టుగా నిప్పులు చెరుగుతున్నారట.

వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తనపట్ల, కొందరు కావాలనే తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తున్నారని లోలోపల కుతకుతలాడిపోతున్నారట జోగురామన్న. ప్రధానంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మనీషా పవన్ రావు, మాజీ సర్పంచ్ రఘుపతిలపై జోగురామన్న కారాలు మిరియాలు నూరుతున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి పీఠం దక్కకుండా ఎత్తుగడలు వేశారని రుసరుసలాడుతున్న జోగు, ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కై తన కుమారుడు ప్రేమేందర్‌ను, మున్సిపల్ చైర్మన్ కాకుండా కుట్రలు చేశారని, నిత్యం తన అనుచరుల దగ్గర ఆవేదన చెందుతున్నారట. అయినప్పటికీ చాకచక్యంగా వ్యవహరించి తన కొడుకును, మున్సిపల్ చైర్మన్ చేసి ఆధిపత్యం నిలుపుకున్నానంటారు జోగురామన్న.

ఇక డీసీసీబీ చైర్మన్‌ ఎన్నికల సందర్భంలోనూ మంత్రి ఇంద్రకరణ్‌-మాజీ మంత్రి జోగు రామన్న మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ నడిచింది. డీసీసీబీ చైర్మన్ ఎన్నికల సందర్భంగా చైర్మన్ పదవిని ఆశించారు టీఆర్ఎస్ లీడర్ గోవర్థన్ రెడ్డి. కానీ తనను అస్థిరపరిచడానికి గోవర్థన్ రెడ్డి ఎన్నో కుట్రలు చేస్తున్నారన్నది జోగు ఆరోపణ. అందుకే గోవర్ధన్‌ను ప్రతిపాదించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు జోగు. అయితే, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ద్వారా చైర్మన్ కావడానికి శతవిథాలా ప్రయత్నించారట గోవర్ధన్. కాని జోగురామన్న మాత్రం, ఇంద్రకరణ్‌ వ్యూహాలను అడ్డుకున్నారట. దాంతో డీసీసీ చైర్మన్ గిరి దక్కకుండా చేసిన ఎమ్మెల్యేపై, పగతీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నది జోగు అనుచరుల అనుమానం. మున్నూరు కాపు సామాజికంగా వర్గానికి చెందిన తనను, రెడ్డి వర్గానికి చెందిన నేతలు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారట జోగు. అయితే, జోగు ఆరోపణలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గం మాత్రం ఖండిస్తోందట.

ఆదిలాబాద్‌లోనే కాదు, బోథ్ నియోజకవర్గంలోనూ అసమ్మతి చిచ్చు ఎప్పటికప్పుడు నిప్పులు చిమ్ముతూనే వుంది. అక్కడ మాజీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరూ ఒకే పార్టీ నాయకులైనా ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారు. రాథోడ్ బాపు అభివృద్ధి పనులను, తాము చేసిన పనులుగా నగేష్ వర్గం ప్రచారం చేసుకుంటోందని, తాము చేసిన పనులకే తిరిగి శంకుస్థాపనలు చేస్తున్నారన్న రగడ సాగుతోంది.

ఇలా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌లో లుకలుకలు చల్లారడం లేదు. ఏకంగా అధిష్టాన పెద్దలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇలాంటి విభేదాలతోనే ఎన్నికల్లో గెలవాల్సిన సీట్లు ఓడిపోయామని, అధినేత ఫైర్ అయ్యారట. ఇక నుంచి గొడవలు మాని, పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలన్నారట. అయినా నేతల తీరులో మార్పు రావడం లేదని, కార్యకర్తలు కుమిలిపోతున్నారట.


Full View

 

Tags:    

Similar News