రేవంత్‌పై విరుచుకుపడే గులాబీ నేతల సైలెన్స్‌ వెనక అదిరిపోయే స్కెచ్‌ వుందా?

Update: 2020-06-13 11:41 GMT

కేటిఆర్ ఫాంహౌస్‌ అక్రమం అంటూ రేవంత్‌ రెడ్డి కొన్ని రోజులుగా ధాటిగా మాట్లాడుతున్నారు. కానీ మొన్నటి వరకు ఏకధాటిగా కౌంటర్లిచ్చిన టిఆర్ఎస్ నేతలు మాత్రం, ఎందుకనో మాట్లాడ్డం లేదు. విమర్శల జడివాన కురిపించడం లేదు. మొక్కుబడిగా ఇద్దరితో ప్రెస్‌మీట్ పెట్టించిన పార్టీ పెద్దలు మళ్లీ సైలెంట్‌ ఎందుకయ్యారు? ఈ మౌనం వెనక అంతుచిక్కని వ్యూహం వుందంటున్నారు గులాబీ నేతలు.

తెలంగాణలో ఫాంహౌజ్ రాజకీయాల మంటలు ఎగసిపడుతున్నాయి. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు హీటెక్కిస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలు అంతకంటే ఎక్కువే, నిశ్శబ్దంగా నిప్పు రాజేస్తున్నాయి. 111 జీవో పరిధిలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే 111 నిబంధనలకు విరుద్దంగా అక్కడ కేటిఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారంటూ, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఆయనతో పాటు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. ఆ తరువాత వెంటనే టిఆర్ఎస్‌కి చెందిన ఎమ్మెల్యే విప్ బాల్క సుమన్‌తో పాటు మండలి విప్ కర్నె ప్రభాకర్ కూడా ప్రెస్‌మీట్లతో రేవంత్ ఆరోపణలను ఖండించారు. కేటిఆర్‌కు సొంతంగా అక్కడ ఫామ్ హౌజ్ లేదన్నారు. 111 జీవో పరిధిలో కాంగ్రెస్ నేతలకు చాలామందికి గెస్ట్‌‌హౌస్‌లు, ఫామ్‌హౌస్‌లు ఉన్నాయంటూ ఆరోపణలతో ఎదురుదాడి ప్రారంభించారు. ఆ తరువాత మళ్లీ, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, ఆ ఫామ్‌హౌస్‌ కేటిఆర్‌దేనంటూ మరికొన్ని డీటైల్స్‌, డాక్యుమెంట్స్‌ చూపారు.

అయితే కేటీఆర్‌పై రేవంత్‌ ఈస్థాయిలో ఆరోపణలు చేస్తున్నా, టీఆర్ఎస్‌ నేతలు మాత్రం ఇప్పుడు కిమ్మనడం లేదు. ఇంతెత్తున లేచే గులాబీ ఫైర్‌బ్రాండ్ లీడర్లు సైలెంట్‌ అయిపోయారు. రేవంత్‌ కౌంటర్లను ఎన్‌కౌంటర్‌ చెయ్యడం లేదు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ నేతలనే ఆలోచనలో పడేశాయి. అదేేపనిగా చెలరేగిపోయే గులాబీ నాయకులు, ఎందుకు మౌనంగా వుండిపోయారని మదిని మథించారు. అయితే చాణక్యుడికే మతిపోయేలా రాజకీయ వ్యూహాలకు దిట్టయిన గులాబీ అధినాయకుల స్ట్రాటజీలను పట్టుకోవడం అంతఈజీ కాదు. రేవంత్ విషయంలో పార్టీ పెద్దలు సైలెంట్ గా ఉన్నారంటే దాని వెనక పెద్ద ప్లానే ఉండి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. టీఆర్‌ఎస్‌ నేతల సైలెన్స్‌,‌ శతాధిక పార్టీ ఖద్దరు నేతలకు మైండ్‌ బ్లాంకయ్యేలా చేస్తోంది.

టీఆర్ఎస్‌ నేతల మౌనానికి చాలా కారణాలున్నాయని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టారంటూ, కేటీఆర్‌పై రేవంత్‌ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సమయంలోనే, గులాబీదళానికి అనుకోని ఆయుధం చిక్కింది. ట్రిపుల్ వన్‌ జీవోకు వ్యతిరేకంగా ఎక్కువ నిర్మాణాలు కాంగ్రెస్‌ నేతలకే వున్నాయని ఆలస్యంగా తెలుసుకున్నట్టుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. జీవో పరిధిలో ఎక్కువ ఫాంహౌస్‌లు కాంగ్రెస్‌ లీడర్లకే వున్నాయన్న సమాచారం తెప్పించుకుంది. ఇప్పుడు వారందరికీ నోటీసులు ఇచ్చి రూల్స్‌కు విరుద్దంగా నిర్మించిన వాటిని కూల్చేయాలని భావిస్తోంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

అధికార పార్టీని టార్గెట్‌ చేద్దామనుకుంటే, అటు తిరిగి ఇటు తిరిగి అదే తమవైపు దూసుకొస్తోందని తెలిసి షాకవుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రేవంత్ చేసిన పనికి ఇప్పుడు తమ ఫామ్‌హౌస్‌లు ధ్వంసమయ్యే ప్రమాదం దాపురించిందని మథనపడుతున్నారట. టీఆర్‌ఎస్ రివర్స్‌ స్క్రీన్‌ ప్లేతో ఖద్దరు నేతలకు నిద్ర కరువైందట.

సొంత పార్టీకి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు రేవంత్‌పై దుమ్మత్తి పోస్తున్నారట. రాష్ట్రంలో సమస్యలే లేనట్లు, ఈ ఫామ్‌హౌజ్‌ రాజకీయాలనే పట్టుకుని రేవంత్‌ వేలాడుతున్నారని ఫైరవుతున్నారట. నిజంగా రేవంత్ రెడ్డి సమస్యలపై పోరాటం చెయ్యాలనుకుంటే, రాష్ట్రంలో ముఖ్యంగా రైతుల సమస్యలు ఉన్నాయంటున్నారు. అన్నదాతలకు ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువులు దొరకడం లేదు. ఇలాంటి వాటిపై పోరాటం చేయాలి కాని, ఇదంతా ఏంటీ అంటూ కస్సుబుస్సులాడుతున్నారట.

మొత్తానికి రేవంత్‌ ఫాంహౌస్ బాణం, తిరిగి సొంత పార్టీ నేతలకే గుచ్చుకుంటోంది. రివర్స్‌ స్క్రీన్‌ ప్లే స్ట్రాటజీతో, సీనియర్లతోనే రేవంత్‌కు చుక్కలు చూపిస్తున్నామంటున్నారు టీఆర్‌ఎస్ నేతలు. అందుకే ఎవ్వరూ మాట్లాడకండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లే రేవంత్ నోరు మూయిస్తారని అంటున్నారట పార్టీ పెద్దలు.

Tags:    

Similar News