ఇక ఊరుకునేది లేదంటున్న గులాబీ నేతలు.. కడిగేస్తారా ఇక!!
Telangana: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హడావుడి పెరిగిందా?
Telangana: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హడావుడి పెరిగిందా? కొత్త పార్టీ పుట్టుక పాత పార్టీలో పదవుల మార్పులతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయా? అందుకే అధికార పార్టీ అలర్ట్ అయిందా? విపక్షాలకు ఎక్కడా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధినేత సూచించారా? మాటకు మాట ఇస్తూ తూటాలు వదలాలని ఆదేశించారా? గత కొద్దికాలంగా మీడియాకు దూరంగా ఉన్న నేతలు, పోటీ పడి ప్రతిపక్షాలను కడిగి పారేస్తున్నారా? ఎక్కడ ఏమరపాటు లేకుండా జాగ్రత్తలు చెప్పారా? ఇంతకీ తెలంగాణ భవన్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం ఏంటి?
ఇంతకాలం పని చేసుకుంటూ ప్రతిపక్షాలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గులాబీ నేతలు ఇక ఊరుకునేది లేదంటున్నారు. అయినదానికి కాని దాని తమ అధినేతను, సర్కార్‌పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆంధ్రా, తెలంగాణ మధ్య నీటి వివాదంతో రాష్ట్ర స్థాయిలో మంత్రులు ఏపీ సర్కార్‌పై బాణాలు ఎక్కుపెట్టి విమర్శలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన కారు పార్టీ ఎమ్మెల్యేలు విపక్షాలపై ఎదురుదాడి మొదలు పెట్టారన్న చర్చ జరుగుతోంది.
మరోవైపు తెలంగాణ పీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి వచ్చి రావడంతోనే అధికార పక్షాన్ని కడిగి పారేసేంత పని చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన నేతలను రాల్లతో కొట్టాలంటూ అప్పట్లో పిలుపునిచ్చి సంచలనం రేపారు. దీనికి బదులుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు రేవంత్‌పై మాటల దాడి చేశారు. రాజ్యాంగబద్దంగా తాము పార్టీ మారామని పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటని ఆరోపించారు. వరుసగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చిరుమర్తి లింగయ్యతో సహా ఇతర నేతలు ఎక్కడికక్కడ రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు.
తాజాగా, తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అంటూ వైఎస్ షర్మిల కొత్త పార్టీని స్థాపించారు. ఆమె కూడా కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. వివిధ జిల్లాల్లో వరసగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై నిలదీస్తున్నారు. ఎక్కడికక్కడ అధికార పార్టీని ఎండగడుతున్నారు. దీంతో గత ఏడేండ్లుగా సాఫీగా సాగిన టీఆర్ఎస్ పాలనలో ఇంతస్థాయి రాజకీయ ఎదురుదాడి ఎదుర్కోలేదు. దీంతో ఇక రానున్న రెండేళ్లల్లో ప్రజల్లో పట్టు కోసం అటు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి.
ఇప్పటికే బీజేపీ హుజురాబాద్ ఉపఎన్నిక ముంచుకొస్తున్న సమయంలో రాష్ట్ర కమల సారథి బండి సంజయ్ పాదయాత్ర తలపెట్టబోతున్నారు. ప్రజా క్షేత్రంలో అధికార పార్టీని ఎండగట్టడంతో పాటు కేంద్రంలో బీజేపీ సర్కార్ పనితీరు ఏంటో కూడా ప్రచారం చేసుకోవడానికి బయలుదేరబోతున్నారు. ఇన్ని పరిణామాల మధ్య అధికార టీఆర్ఎస్ పార్టీ అలెర్ట్ అయింది. ఎక్కడికక్కడ వీలైనంతగా పార్టీపై దాడి చేసే ప్రతిపక్ష నేతలను వదిలి పెట్టకుండా ఎండగట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని, కేంద్ర సర్కార్ రాష్ట్రంపై వివక్ష చూపుతుందంటూ చెబుతూనే గతంలో కాంగ్రెస్‌ను ఏం చేసిందనే విధానాలపై షర్మిలను, వైఎస్ఆర్ బతికున్న రోజుల్లో తెలంగాణకు చేసిన అన్యాయంపై ఆరోపణలు గుప్పించేందుకు పథక రచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఏమైనా, మొత్తానికి ఇంతకాలానికి తమ అధినేత నుంచి స్పష్టమైన ఆదేశం కోసం ఎదురుచూసిన అధికార పార్టీ నేతలు అది అందీ అందడంతోనే ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారు. మైకులకు పని చెబుతున్నారు. రానున్న రెండేళ్లు రాజకీయంగా కీలకమైన సమయం కావడంతో ఎక్కడ ఏమరపాటు లేకుండా అలెర్ట్‌గా ఉంటూ ప్రతిపక్షాల భరతం పట్టేందుకు ప్లానింగ్‌లో ఉన్నారని తెలంగాణ భవన్ గుసగుసలాడుతోంది.