Top-6 News of the Day: పంట రుణమాఫీపై గైడ్ లైన్స్ విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-07-15 13:00 GMT

Farmers Alert: రైతన్నలకు అలర్ట్..రుణమాఫీ వర్తించని రైతుల వివరాలివి..మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి

1. పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

రైతులు తీసుకున్న పంటల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ. 2 లక్షల పంట రుణమాఫీని మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్ కార్డు ద్వారా రైతు కుటుంబాన్ని గుర్తిస్తారు.


2. సహజవనరులను దోచుకున్నారు: జగన్ ప్రభుత్వ అక్రమాలపై చంద్రబాబు శ్వేతపత్రం

చంద్రబాబునాయుడు సోమవారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సహజవనరుల దోపీడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జరిగిన నష్టాన్ని శ్వేతపత్రాల రూపంలో విడుదల చేస్తున్నారు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షిస్తామని చంద్రబాబు చెప్పారు.


 3. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. గతంలో ఈ విషయమై హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. 2013-18 మధ్యకాలంలో మంత్రిగా ఉన్న సమయంలో డీకే శివకుమార్ ఆదాయానికి మించి ఆదాయం ఉందనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఈడీ అధికారులు 2020లో ఆయనపై కేసు నమోదు చేశారు.


4. వైసీపీ చేసిన తప్పులు చేయవద్దు: పవన్ కళ్యాణ్

ఎంత సాధించినా తగ్గి ఉండాలి. పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. సోమవారం మంగళగిరిలో పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జగన్ పాలనలో అరాచకాలకు పాల్పడినందునే ప్రజలు ఆ పార్టీకి బుద్ది చెప్పారన్నారు. వైసీపీ చేసిన తప్పులు చేయవద్దని ఆయన కోరారు. అలాగని వైసీపీ చేసిన తప్పులకు చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు.


5. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద

హైద్రాబాద్ ఎగువన కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హుస్సేన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో వైపు తెలంగాణకు మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెప్పారు.


 6. ఇమ్రాన్ పార్టీ పీటీఐపై నిషేధం?

పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పై నిషేధానికి ఆ నిషేధం విధించేందుకు ఆ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ తెలిపారు. ఈ విషయమై స్పష్టమైన ఆధారాలున్నందునే చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన వివరించారు.

Tags:    

Similar News