Telangana University: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ యూనివర్సిటీ

Telangana University: రిజస్ట్రార్ల నియామకంలో ఆధిపత్య పోరు

Update: 2023-05-07 14:00 GMT

Telangana University: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ యూనివర్సిటీ

Telangana University: తెలంగాణ విశ్వవిద్యాలయం వివాదాలకు నిలయంగా మారింది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఉన్నత ప్రమాణాలతో నెలకొల్పిన తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్ట నానాటికి దిగజారి పోతుంది. వివాదాలు, సమస్యల మధ్య విద్యార్థులు, ఉద్యోగులు నలిగిపోతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన పాలకమండలి, వైస్‌ ఛాన్సలర్‌ల మధ్య వివాదాలే అసలు సమస్యగా మారాయి. అనేక ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో విశ్వవిద్యాలయం స్థాయి దిగజారే విషమ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పాలకమండలి ఆమోదం లేకుండా, ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌కు సమాచారం లేకుండా రిజిస్ట్రార్‌ను మార్చడం కొత్త వివాదానికి తెరలేపింది.

ఇటీవల జరిగిన తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో వీసీ రవీందర్‌ గుప్తాపై చర్యలకు డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేశారు. అయితే ఈ మేరకు వీసీపై చర్యలు ఉంటాయి అనేది సంశయంగా మారింది. దాదాపు మూడేళ్ళుగా వీసీ రవీందర్‌ గుప్తాపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వీసీ అక్రమాలపై అనేక ఫిర్యాదులు, పలుమార్లు ఆందోళనలు కూడా చేపట్టారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని నిబంధనల ప్రకారంగా వీసీ తనకేమీ కాదనే ధీమాలో ఎవరినీ లెక్కచేయడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే బుధవారం రోజున తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరి స్థానంలో ఓయూ ఈసీఈ హెడ్‌ నిర్మలాదేవిని నియమిస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హుటాహుటిన రిజిస్ట్రార్‌గా నిర్మలాదేవి బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే అదేరోజు సాయత్రం రిలీవ్‌ ఆర్డర్‌ రద్దు చేస్తూ తిరిగి ఓయూలో చేరాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రిజిస్ట్రార్‌ నియామకంపై హడ్రామా కొనసాగింది. తనను ప్రభుత్వం నియమించిన విసి రవిందర్ గుప్తా ఆమోదం మేరకు రిజిస్ట్రార్ గా విధుల్లో చేరడం జరిగిందని, 90 రోజుల్లోనే పాలక మండలి అనుమతి తీసుకుంటారని తెలిపింది. అంతే కాకుండా నియమ నిబంధనల మేరకు యూనివర్సిటీలో చేరి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తునని నిర్మలా దేవి తెలిపారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే వీసీ రవీందర్‌ గుప్తా, ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హైకోర్టులో వేసిన కేసు తీర్పు తనకు అనుకూలంగా రావడంతో ఏకంగా నవీన్‌ మిట్టల్‌ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రవీందర్ గుప్తా. పాలక మండలి సమావేశంలో వైస్ ఛాన్స్‌లర్ లేకుండా తీసుకున్న నిర్ణయాలు చెల్లవన్నారాయన. రిజిస్ట్రార్ నియామకం విషయంలో.. ఉన్నత విద్యామండలి కమిషనర్ నవీన్ మిట్టల్ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని రవీందర్ గుప్తా ఆరోపించారు.

మొదటి నుంచి వీసీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం, ఎవరినీ లెక్కచేయనితనం సమస్యలను మరింత జఠిలం చేసింది. వైస్ చాన్సులర్ రవీందర్‌ గుప్తా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివాదాల దుమారం రేగింది. విద్యార్థి సంఘాలు, పాలకమండలి సభ్యులు వీసీ తీరుపై అనేకసార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోని వీసీ తనదైన శైలిలో విశ్వవిద్యాలయంలో ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 140 మందికి పైగా నియామకాలు చేపట్టడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లుగా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు ఇస్తానని డబ్బులు వసూలు చేసినట్లు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి . 2014 రెగ్యులర్‌ బోధన సిబ్బందికి ప్రమోషన్ల వ్యవహారంలో డబ్బులు భారీగా తీసుకుని వీసీ అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యోగుల పేరున అడ్వాన్స్‌ డబ్బులను లక్షల్లో తీసుకొని వాడుకున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి.

వీసీపై చర్యలు తీసుకునే అధికారం గవర్నర్‌ కు ఉన్నా.. ప్రస్తుతం ప్రగతి భవన్‌కు.. రాజ్ భవన్‌కు మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఇదే అదనుగా వైస్ ఛాన్స్‌లర్ రవీందర్ గుప్తా రెచ్చిపోతున్నాడనే చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హెచ్చరించినా వీసీ తీరు మారడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రిజిస్ట్రార్‌ ను వెనక్కి రావాలని ఓయూ ఉత్తర్వులు ఇచ్చినా..వీసీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

మరోవైపు.. యూనివర్సిటీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన మరో వివాదానికి దారి తీసింది.. వేతనాలు రాకపోవడంతో 240 మంది ఉద్యోగులు ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే రిజిస్ట్రార్‌ ఎవరో తెలియకపోవడంతో డబ్బులు వేయలేదని బ్యాంక్‌ అధికారులు తేల్చారు. ఈ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంత జరిగినా వీసీ ఏమాత్రం తగ్గకపోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది.

ఓవరాల్‌గా.. తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.. వీసీ, పాలకమండలి మధ్య విభేదాలతో..యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. మరి ఇప్పటికైనా... ప్రభుత్వం గానీ, గవర్నర్ గానీ జోక్యం చేసుకుని యూనివర్సిటీలో నెలకొన్న వివాదాలకు చెక్ పెడతారా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News