భట్టి, శ్రీధర్ బాబుల రహస్య సమావేశం కాంగ్రెస్‌లో ఎందుకు అలజడి రేపుతోంది?
ఒక రహస్య మీటింగ్, తెలంగాణ కాంగ్రెస్‌లో మంటలు రేపుతోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో, వారి సీక్రెట్ సమావేశం, అగ్గి రాజేస్తోంది. ఒకరికి వ్యతిరేకంగా, మరొకరికి అనుకూలంగా స్కెచ్ వేసేందుకే, భేటి అయ్యారన్న వార్తలు, కాకలు తీరిన కాంగ్రెస్ నేతలకు కుదురుగా ఉండనివ్వడం లేదు. అసలు టీ కాంగ్రెస్‌లో తుపానుగా మారిన, ఆ రహస్య సమావేశమేంటి? దాని అజెండా ఏంటి? తెరవెనకుండి నడిపిస్తోంది ఎవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ మార్పు ఫోబియా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నేతల రహస్య సమావేశాలు, చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎలాగైనా తమకైనా పీసీసీ పీఠం దక్కాలి, లేదంటే మనకు అనుకూలమైన నేతనే వరించాలి, పొరపొటున కూడా, మనకేమాత్రం పడని లీడర్‌కు గాంధీభవన్ పీఠం దక్కేందుకు వీల్లేదంటూ గ్రూపులు కడుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు లాబీయింగ్ చేస్తున్నారు. ఎవరి అజెండా ప్రకారం ఆ వర్గం నేతలు మీడియా ముందుకొచ్చి ఒక్కో వెర్షన్ వినిపిస్తున్నారు. సోమవారం సీఎల్పీ ఆఫీసులో ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు రెండు గంటల పాటు రహస్య మంతనాలు జరపడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీసీసీ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. పీసీసీ మార్పుపై అధిష్ఠానం అభిప్రాయం కోరితే ఏం చెప్పాలనే దానిపై చర్చ జరిపినట్లు ఆ నేతలు చెబుతున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ పీఠం నుంచి తప్పించి కొత్త నేతను త్వరలో ప్రకరటిస్తారని ఢిల్లీ నేతల నుంచి ఉప్పందడంతో రాష్ట్ర్ర నేతల్లో చర్చలు ఊపందుకున్నాయి. ప్రధానంగా ఈ ముగ్గురు నేతలు తాము పీసీసీ రేసులో ఉన్నామని బహిరంగంగానో, అంతర్గతంగానో చెప్పుకుంటున్నావారే. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డిల మధ్య ప్రధానంగా పీసీసీ చీఫ్ రేస్ నడుస్తోందని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం అధికార ప్రతినిధిగా కొద్ది రోజుల నుంచి జగ్గారెడ్డి, వి.హనుమంతరావులు వ్యవహరిస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ రేవంత్ రెడ్డికిస్తే, రాజకీయం వేరేగా ఉంటుందన్నట్లుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా ప్రభుత్వంపై పోరాడుతున్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ విషయంలో పాలకపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారని కాంగ్రెస్ కార్యకర్తలు తెగ ఖుషీ అవుతున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ దృష్టిలో మరిన్ని మార్కులు తెచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రేవంత్‌కు కాస్త అనుకూలంగా గాలి వీస్తే చాలు, అటు ప్రత్యర్థి పక్షమే కాదు, ఇటు స్వంత పక్షంలోని వ్యతిరేక వర్గమూ అలర్టవుతోంది. ఈ నేపథ్యంలోనే, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, శ్రీధర్ బాబుకు అనుకూలంగా లాబీయింగ్ చేయాడానికే, భట్టి నేతృత్వంలో ఓ వర్గం పట్టు సాధించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోందన్న చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే సీఎల్పీ వేదికగా, భట్టి తనదైన శైలిలో శ్రీధర్ బాబు కోసం మంతనాలు సాగిస్తూ, మద్దతు కూడగడుతున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ నాయకత్వం టీ పీసీసీ చీఫ్‌ను మార్చాలని ఎప్పుడో డిసైడయ్యింది. కానీ నిర్ణయాన్ని మాత్రం అదే పనిగా వాయిదా వేస్తూ వస్తోంది. ఫలితంగా నేతల మధ్య కుమ్ములాటలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిర్ణయం ప్రకటిస్తే.. తర్వాత అసంతృప్తి వ్యక్తమైనా అందరూ సర్దుకుంటారన్న అభిప్రాయంతో కొంతమంది నేతలు ఉన్నారు. అయితే తమ వర్గం నేతకే పిసిసి పీఠం వరిస్తే, పార్టీలో తమ హవాకి ఢోకా ఉండదని భావిస్తున్న నేతలు, ఇలాంటి రహస్య చర్చలతో సైలెంట్‌గా పావులు కదుపుతున్నారు. పీసీసీ పదవి కోసం, కాంగ్రెస్‌లో ఇన్ని గ్రూపులు కుస్తీపడుతున్నాయి. ఒక్కసారి ప్రకటన వచ్చేస్తే, గాంధీభవన్‌లో భూకంపం ఏ రేంజ్‌లో వుంటుందోనని కార్యకర్తలు టెన్షన్ పడిపోతున్నారు.