పొగడ్తలంటే ఎవరికి ఇష్టం కాదు. ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవ్వాలనుకుంటారు. తనను పొగిడితినే కాదు, ప్రత్యర్థిని తెగిడినా తెగ ఆనందపడిపోతారు. ఇప్పుడు ఇవే కొన్ని పొగడ్తలు, ఇంకొన్ని తెగడ్తలు, ఉత్తమ కుమారుడికి తెగ ఇబ్బందిగా మారాయి. ప్లీజ్....నన్ను ఆడుకోవద్దంటూ విన్నవిస్తున్నారు. కోపం నషాళానికి చేరి కోప్పడ్తున్నారు.
ఒకరిని తెగిడితే, మరొకరిని పొగిడినట్టు. ఒకరిని పొగిడితే, మరొకరిని తెగిడినట్టు. ఈ సూత్రమొకటి తెలిస్తే చాలు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. శతాధిక కాంగ్రెస్‌లో కాకలు తీరిన రాజకీయ నాయకులకు, ఈ చిట్కా బాగా ఒంటబెట్టిందన్న విషయంలో, ఎవరికీ డౌట్స్ లేవు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లోనూ ఇలాంటి తిట్లు, పొగడ్తల ఫార్ములా ఒకటి బాగా నడుస్తోంది. అది పీసీసీ చీఫ్ నుంచి రేపోమాపో దిగిపోదామనుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి తలనొప్పిగా మారింది.
రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తే చాలు, ప్రత్యర్థి పార్టీ విరుచుకుపడ్డం కాదు, స్వంత పార్టీలోని కొందరు నేతలే బాహాటంగా విమర్శలు సంధిస్తున్నారు. పీసీసీ పీఠం రేవంత్‌కు అప్పగించడం ఖాయమన్న మాట వినిపించినా ప్రతిసారీ, ఫైరయిపోతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్‌కు పీసీసీ ఇవ్వొద్దంటూ మండిపడుతుంటారు. రేవంత్‌ను కార్నర్ చేయడంలో, జగ్గారెడ్డి, వీహెచ్‌లే ముందుంటారు. వీరే ఇప్పుడు ఉత్తమ్‌కు చికాకుగా మారారట.
పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ను వద్దనడమే కాదు, ఉత్తమ్‌నే కొనసాగించాలని కూడా జగ్గారెడ్డి, వి.హనుమంత రావు పదేపదే ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దు అని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ మాటలే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇబ్బందిని తెచ్చిపెడుతున్నారు. ఉత్తమే, తనకు అనుకూలంగా, వీరితో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారన్న భావన అందరిలోనూ కలుగుతోంది. ఇదే విషయం ఉత్తమ్ దగ్గరా కొందరు ప్రస్తావించారట. కానీ ఉత్తమ్ ఖండించారట. పీసీసీ చీఫ్‌గా కొనసాగడం తనకెంతమాత్రమూ ఇష్టంలేదని, ఇలాంటి ప్రచారం తనకు సమస్యగా మారుతోందని అన్నారట.
అదే పనిగా తననే పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలంటూ వ్యాఖ్యానాలు చేస్తున్న జగ్గారెడ్డి, వీహెచ్‌లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట ఉత్తమ్. ఎందుకిలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ జగ్గారెడ్డిని మందలించారట. సీనియర్ అయిన వీహెచ్‌ను మాత్రం, ఏమీఅనలేక లోలోపల కుమిలిపోతున్నారట ఉత్తమ్.
ఉత్తమే పీసీసీ చీఫ్‌గా కంటిన్యూ కావాలన్నది, ఖద్దరు నేతల నిజమైన కోరికేమీ కాదు. ఎటు తిరిగి రేవంత్ మాత్రం గాంధీభవన్ సింహాసనం ఎక్కకూడదన్నది వారి పంతం. అందుకే ఉత్తమ్ కావాలంటూ, ఇన్‌డైరెక్టుగా రేవంత్‌ను వద్దంటున్నారు. వీరి వ్యాఖ్యల వెనక ఉత్తమ్ ప్రమేయం ఏమీ లేకపోయినా, ఆయనకు చికాకు తెప్పిస్తోంది. అందుకే అలాంటి పొగడ్తలు, తెగడ్తలు వద్దని వారికి క్లాస్ తీసుకున్నారట. మరి ఇకనుంచైనా సదరు నేతలు అలాంటి వ్యాఖ్యానాలు బంద్ చేస్తారో...కంటిన్యూ అంటారో చూడాలి.