వారందరికి ఎంత దండం పెట్టినా తక్కువే : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలుపై అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఈ రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో నిర్వహించారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలుపై అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఈ రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకిన వారికి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ కొనియాడారు. వారితో పాటు పారిశుద్ధ్య కార్మికులు సైతం కరోనా పోరాటంపై తమ వంతుగా కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రెండు చేతులెత్తి నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారికి దండం పెడుతున్నా. పాదాభివందనం చేస్తున్నా అని సీఎం తెలిపారు. వైద్యుల ధైర్యం, పారిశుధ్య కార్మికులు ఎంతో గొప్ప వారు అని అన్నారు. వారందరికి ఎంత దండం పెట్టినా తక్కువే అన్నారు.
అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఆయన తియ్యటి కబురు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 95,392 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని అన్నారు. వారందరికీ సీఎం ప్రోత్సాహం కింద మున్సిపల్, గ్రామపంచాయతీ పారిశుద్ద్య కార్మికులకు రూ. 5 వేలు ఇస్తాం అని ఆయన ప్రకటించారు. వారి వేతనాల్లో కోత విధించడం లేదని ఆయన తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్ కార్యకర్తలకు రూ. 7,500 ఇస్తాం. వారితో పాటుగానే వైద్య సిబ్బందికి, డాక్టర్లకు జీతాలు పెంచి ఇస్తామని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు నగారన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు కాబట్టే వైరస్ ను కంట్రోల్ చేయగలుగుతున్నామని అన్నారు.