చిట్టి 'నయనశ్రీ'.. స్కేటింగ్ లో సూపర్ స్పీడ్ !

Update: 2020-08-25 07:49 GMT

Seven-year-old Nayanashree set a record in Skating : ఆమె చిన్నపిల్ల కాదు చిచ్చర పిడుగు ఏడేళ్లకే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. స్కేటింగ్ లో రాణించేందుకు కఠోర సాధన చేసింది. చివరకు ఎన్నో పథకాలు మరెన్నో ప్రశంసలను సాధించింది. చిన్న వయస్సుల్లోనే పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుంది. అవి సాధించేందుకు అనుక్షణం తపన పడుతోంది. కానీ ఆ చిన్నారికి లక్ష్మీదేవి కటాక్షం లభించడం లేదు. మధ్యతరగతి ఫ్యామిలీ కావడంతో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. దాతలు సహకరిస్తే తాను మెరుగైన పథకాలు సాధిస్తా అంటూ చెబుతున్న ఆ చిన్నారి ఎవరో ఇప్పుడు చుద్దాం..

2020 జనవరిలో సింగాపూర్ లో సౌత్ ఈస్ట్ ఏసియన్ ఫాస్ట్ ట్రాక్ స్కేటింగ్ ట్రోపీ జరిగింది. ఈ పోటీల్లో చిన్నారి నయనశ్రీ అత్యుంతమ ఆటను ప్రదర్శించి, 500 మీటర్ల మిక్స్డ్ పోటీల్లో రజితం, కాంస్యం పథకాలను సాధించి ఔరా అనిపించింది. వయస్సు చిన్నదైనప్పటికీ ఆశయం మాత్రం పెద్దది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నది ఆ చిన్నారి తాపత్రయం.

ఖమ్మం జిల్లాలోని మోటమర్రి గ్రామానికి చెందిన తాళ్లూరి నారాయణరావు, వీణ దంపతుల ఏకైక కుమార్తె నయనశ్రీ. హైదరాబాద్ లోని విజ్ఞానజ్యోతి పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఏడేళ్ల వయస్సు రాగానే చిన్నారికి స్కేటింగ్ ఆటపై ఆసక్తి ఉందని గమనించారు. హైదరాబాద్ లోని కోట్ల విజయబాస్కర రెడ్డి స్టేడియంలో శిక్షణ ఇప్పించారు. నయనశ్రీ రోలర్ స్కేటింగ్ లో మాత్రమే శిక్షణ తీసుకుంది. ఫిగర్ స్కేటింగ్, ఐస్ స్కేటింగ్లకు మన దగ్గర శిక్షణాకేంద్రాలు లేవు. నయనశ్రీలో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించిన కోచ్ లు ఢిల్లీ, సిమ్లాకు తీసుకువెళ్లి అక్కడ ఫిగర్, ఐస్ స్కేటింగ్ ల్లో మెళకువలు నేర్పించారు. ఇంకేముంది ఆ చిన్నారి చిచ్చరపిడుగులా దూసుకెళ్లింది. వేదిక ఎక్కడైనా పోటీ ఎవరితోనైనా ర్యాంకు మాత్రం పక్కా అన్నట్లు చెలరేగిపోయింది ఆ చిన్నారి. పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఏకంగా 38 పతకాలు సాధించింది. శిక్షణ తీసుకున్న 8 నెలల్లోనే తన విజయపరంపర కొనసాగించింది.

ప్రస్తుతం నయనశ్రీ నవంబరులో జరిగే అంతర్జాతీయ పోటీలకు సాధన చేస్తోంది. బెలారస్ దేశంలో జరుగనున్న అంతర్జాతీయ ఐస్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో తన సత్తా చాటేందుకు విశేషంగా కృషి చేస్తోంది. నయనశ్రీ ఫిట్ నెస్ కోసం 23 కిలోమీటర్ల దూరం వరకు సైక్లింగ్ చేస్తోంది. తన ప్రతిభకు లోటు లేదు. తన కృషికి కొదవ లేదు. కానీ ఆర్థిక ఇబ్బందులు ఆ చిన్నారికి వెంటాడుతున్నాయి. తనది మధ్యతరగతి కుటుంబం కావడంతో ఐస్ స్కేటింగ్ సాధన కోసం షూన్, బ్లేడ్లు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. పైగా అంతర్జాతీయ పోటీలకు వెళ్లలంటే ప్రయాణం, వసతి సౌకర్యాలు పెద్ద ఖర్చుతో కూడుకున్నవి. రాబోయే ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా నయనశ్రీ ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు దేశం నుంచి మొదటి బాలికల విభాగంలో నయనశ్రీ ఒక్కరే ఉండడం గర్వించదగ్గ విషయం. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు.


Tags:    

Similar News