Rare fish in Khammam : చేపలలో చాలా రకాల చేపలు ఉంటాయి. వాటిలో కొన్ని చేపలను ప్రజలు చాలా ఇష్టంగా తినడానికి చూస్తే, కొన్ని చేపలను మాత్రం కేవలం ఎక్వేరియంలో మాత్రమే ఉంచడానికి ఇష్టపడతారు. ఈ చేపలను చూస్తే వాటితో ఆడుకోవాలని, వాటిని పట్టుకోవాలని అనిపిస్తుంది. కానీ ఓ రకం చేపను చూస్తే మాత్రం దాన్ని తాకడానికి, తినడానికి కూడా ప్రజలు ఎవరూ కూడా ఇష్ట పడరు. ఆ చేప అన్ని చేపలలాగా కాకుండా ఏదో వింత ఆకారంలో కనిపిస్తుంది. అసలు అది చేపనా లేక నీటిలో తిరిగే ఏదైనా వింత ఆకారమా అనిపిస్తుంది. ఒంటినిండా జీబ్రా టైపు గీతలతో.. పొడుగ్గా ఎలుక మూతి ఆకారంలోని నోటితో చూడ్డానికి కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. అది కూడా సాధారణంగా ఎక్కడ బడితే అక్కడ కనిపించదు. అది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ అది ఏ చేప, దాని గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.
అయితే పూర్తి వివరాల్లోకెళదాం ఒంటి నిండా జీబ్రా గీతలతో అరుదుగా దొరికే చేపే 'దెయ్యంబేరు' చేప. ఈ చేప నీటి అడుగులో నాచు, పాచి ఉన్న చోట ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చేపని క్లీనింగ్ ఫిష్ అని.. పెల్కో ఫిష్ అని.. జానీటర్ ఫిష్ అని కూడా అంటారు. ఇంకా చెప్పాలంటే సాంకేతిక పరిభాషలో దీన్ని 'సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్' అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అరుదుగా కనిపించే ఈ చేప ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరిసింహులుగూడెంలోని ఓ చెరువులో డేగల వీరయ్య అనే వ్యక్తి చేపల కోసం వల వేయగా ఇది దొరికింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు చెరువులు అన్నీ నిండి పోవడంతో మత్తడి వదిలారు. దీంతో గ్రామస్థులు చేపల్ని పట్టగా ఈ చేప ఓ వలలో చిక్కింది. అయితే ఈ చేపని పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రంలో దీన్ని అప్పగించారు.
ఈ విచిత్రమైన ఆకారంతో ఉన్న చేప గురించి మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన సైంటిస్ట్ డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డిని వివరాలు అడగగా దీన్ని దెయ్యంబేరు చేప అని పిలుస్తారని తెలిపారు. ఈ రకం చేపలు చాలా అరుదుగా కనిసిస్తాయని తెలిపారు. ఒల్లంతా ముల్లు ఉన్న ఈ చేపకి మాంసం తక్కువ, ఎముకలు ఎక్కువగా ఉంటుందని, అందుకే దీన్ని తినడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరని, వీటిని అక్వేరియంలలో పెంచుకోవడం కరెక్టన్నారు. తినడానికి ఈ చేప పనికిరాకపోయినా, ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న కేజ్ పద్దతిలో చేపల పెంపకానికి దీన్ని సహాయకారిలా, ఓ సర్వెంట్‌లాగా ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దెయ్యం చేపలకు సంబంధించిన విత్తన ఉత్పత్తి కూడా క్లిష్టమని ఆయన తెలిపారు. ఈ రకం చేపల విత్తనాన్ని బంగ్లాదేశ్‌లో మాత్రమే ఉత్పత్తి చేస్తుంటారని అధికారులు చెప్పారు.