Priyanka Gandhi: యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్న ప్రియాంక గాంధీ

Update: 2023-05-08 01:57 GMT

Priyanka Gandhi: యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్న ప్రియాంక గాంధీ 

Priyanka Gandhi: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించే యువ సంఘర్షణ సభలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ యూత్‌ డిక్లరేషన్‌ ను ప్రకటించనున్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి.. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌.. యువతకు రాజకీయ అవకాశాలు కల్పించే అంశాలు డిక్లరేషన్ లో ఉండనున్నాయి. టీఎస్ పీఎస్సీ పేపర్‌ లీకేజీలను, ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. తమ ప్రభుత్వం వస్తే ఏం చేయనున్నదో స్పష్టతనివ్వనున్నారు. యువ సంఘర్షణ సభ పేరిట విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై పోరాట కార్యక్రమంగా టీపీసీసీ సభను నిర్వహిస్తోంది.

వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను రైతుల్లోకి ఎలా తీసుకెళ్లారో యూత్‌ డిక్లరేషన్‌ను యువత వద్దకు అలానే తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇది ప్రియాంకకు తెలంగాణలో తొలి సభ. దీంతో టీపీసీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎలా కల్పిస్తుందన్నది ప్రధానంగా ప్రియాంక హామీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రకటించే యూత్‌ డిక్లరేషనే ప్రధాన ఆకర్షణ కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, టీఎస్ పీఎస్సీ పేపర్‌ లీకేజీని టార్గెట్‌ చేస్తూ టీపీసీసీ పలు కార్యక్రమాలు చేపట్టింది. యువ సంఘర్షణ సభలో ఈ అంశంతో పాటు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రియాంక ద్వారా చెప్పించి.. నిరుద్యోగులను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది.

సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదికపైన ప్రియాంక గంట పాటు ఉంటారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ప్రియాంక రావడానికి ముందే మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. మరోవైపు ప్రియాంక శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సరూర్‌నగర్‌ రావాల్సి ఉండగా.. షెడ్యూల్‌లో స్పల్ప మార్పు జరిగింది. ఆమె బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.30కు బేగంపేట చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సరూర్‌నగర్‌ స్టేడియానికి వస్తారు. ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు అందిస్తారు. తర్వాత ప్రసంగం ముగించుకుని సాయంత్రం 5.30కు హెలికాప్టర్‌లో బేగంపేట వెళ్లి.. అక్కడినుంచి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. 

Tags:    

Similar News