Navy Vice Admiral Letter to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేవీ వైస్ అడ్మిరల్ లేఖ..
Navy Vice Admiral Letter to CM KCR: తెలంగాణ సీఎం కేసిఆర్ కు నేవీ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ లేఖ రాశారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ కు నేవీ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ లేఖ రాశారు. తెలుగుతేజం అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశసేవలో ప్రాణాలర్పించిన ఓ అమరవీరుడి కుటుంబం పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ చూపిన అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు వైస్ అడ్మిరల్ రెండు పేజీల లేఖను రాశారు. ఓ సీఎం స్థాయిలో ఉంటూ ఏకంగా 100 కిలోమీటర్లు వెళ్లి కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడం అంటే మామూలు విషయం కాదన్నారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అత్యున్నతమైన ప్యాకేజీని అందించడం ద్వారా మిగిలిన వారికి సీఎం ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
అలాగే, కేసీఆర్ కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితను కూడా వైస్ అడ్మిరల్ అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్‌ను ఓ సారి సందర్శించవలసిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ ఆహ్వానించారు. ఎందరో సైనికులను తయారు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థలో తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఉన్నారని పవార్ ప్రస్తావించారు.
దేశ సరహద్దుల్లో గాల్వన్ ప్రాంతంలో చైనా - భారత్ దళాల మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయిన సీఎం కేసీఆర్ అనంతరం సూర్యాపేటలోని సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. సంతోష్ బాబు చిత్రపటానికి సీఎం నివాళి అర్పించారు. సంతోష్ సతీమణి సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. సంతోష్ బాబు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం సంతోష్ బాబు కుటుంబానికి ఎల్లవేళలా అండగా వుంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్.. రెండు పేజీల లేఖను పంపారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు.