కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని జలసౌధలో లో జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇందులో ఏపీ, తెలంగాణ అధికారులు ఎవరి వాదనను వారు వినిపించారు. ఈ సందర్బంగా ఈ ఏడాది కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్‌ను 50:50 వాడుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు. అలాగే ఇరు రాష్ట్రాలకు చెందిన అన్ని ప్రాజెక్టుల డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)లు ఇవ్వాలని కూడా ఆదేశించామన్నారు..
ఇరు రాష్ట్రాల అధికారులు తమ ప్రభుత్వాలతో సంప్రదించి డీపీఆర్‌లు సమర్పిస్తామని చెప్పినట్టు పరమేశం పేర్కొన్నారు.. ఇక ఈ ఏడాది కూడా కృష్ణా బేసిన్ లోని నీటిని 66:34 నిష్పత్తిలో నీటిని పంచుకునేందుకు ఒప్పందం కుదిరిందని, టెలిమెట్రీల ఏర్పాటు కోసం కేఆర్‌ఎంబీకి నిధులు ఇస్తామని రెండు రాష్ట్రాల అంగీకారం తెలిపినట్టు చెప్పారు. అలాగే శ్రీశైలంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు వాడకం తోపాటు, బోర్డుకు రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధులపైనా కూడా సమావేశంలో చర్చించారు.
ఇక గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు, బోర్డు సిబ్బంది పోస్టింగులు, బోర్డు వ్యయంపై ఆడిటింగ్‌పైనా చర్చించారు. మందుగా తెలంగాణ ప్రభుత్వం తరుఫున ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులపై వాదనలు వినిపించారు.. ఆ తరువాత ఏపీ తరపున ఏపీ ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ ఏపీ వాదనలు విన్పించారు.
రజత్‌కుమార్ వాదన : రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దని రజత్‌కుమార్ తేల్చి చెప్పారు. కృష్ణా నదిపై ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని, వాటినే ప్రస్తుతం కొనసాగిస్తున్నట్టు చెప్పారు.
ఆదిత్యనాథ్ దాస్ వాదన : తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్ వల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుంది.. ఏపీకి నీటి కేటాయింపులకు అనుగుణంగానే పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నాం. ఇందులో తెలంగాణకు కేటాయించిన నీళ్లను తీసుకోము.. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనుమతులు ఇచ్చిన విధంగా కాకుండా ప్రాజెక్టుల డిజైన్లు మార్చింది, అందువల్లే తెలంగాణ ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణించాలి. తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్ వల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని ఆదిత్యనాథ్ దాస్ వాదించారు.