Kamareddy Politics: ఎమ్మెల్యేలతో గులాబీ ఎంపీ గొడవేంటి?
Kamareddy Politics: ఆయన గులాబీ పార్టీలో మిస్టర్ కూల్ లీడర్.. రెండుసార్లు ఎంపీగా గెలిచి వివాద రహితునిగా మద్ర వేసుకున్న ప్రజా ప్రతినిధి..
Kamareddy Politics: ఆయన గులాబీ పార్టీలో మిస్టర్ కూల్ లీడర్.. రెండుసార్లు ఎంపీగా గెలిచి వివాద రహితునిగా మద్ర వేసుకున్న ప్రజా ప్రతినిధి.. కానీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లోని కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు-సదరు ఎంపీకి మధ్య పూడ్చలేనంత గ్యాప్ వుందట. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆ ఎంపీని పిలిచేందుకు సైతం ఇష్టపడటంలేదట కొందరు ఎమ్మెల్యేలు. ఆయన కూడా పిలవని పేరంటానికి వెళ్లడమెందుకని, ఆ నియోజకవర్గాలను విడిచి మిగతా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎంపీ..? ఏంటా స్టోరీ...? ఎమ్మెల్యేలకు-సదరు ఎంపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. తన పని తాను చేసుకుంటూ కూల్‌గా కనిపిస్తారు. కానీ ఆ ఎంపీకి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలయ్యిందట. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ లోని కొన్ని నియోజకవర్గాల్లో, అడుగు పెట్టాలంటే వెనుకా ముందు ఆలోచిస్తున్నారట.
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. మొదటిసారి గెలిచిన సమయంలో అడపాదడపా ఆ నియోజకవర్గాల్లో పర్యటించిన ఆ ఎంపీ, ఇప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారట. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గతంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న, సమయంలో అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట. ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్‌తో మాత్రం దోస్తానీ ఉందట. బాన్సువాడ లోకల్ ఎమ్మెల్యే పోచారంతో సఖ్యత ఉన్నా అప్పుడప్పుడు వస్తారట ఎంపీ. ఇక కామారెడ్డి, జుక్కల్‌లో మాత్రం అంటీ ముట్టనట్లు ఉన్నారట. బలమైన కారణమేదో, ఎంపీని ఆ నియోజకవర్గాల్లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తోందని పార్టీలో టాక్.
కామారెడ్డి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలకు-ఎంపీకి గ్యాప్ ఉందట. తమ నియోజకవర్గాల్లో ఎంపీ తిరగడం, సదరు ఎమ్మెల్యేలకు సైతం అంతగా ఇష్టంలేదట. అందుకే చాలా కార్యక్రమాల్లో ఎంపీకి, కనీస ఆహ్వానం ఉండటం లేదట. ఈ గ్యాప్ రోజురోజుకు పెరుగుతూనే ఉందన్నది పార్టీ వర్గాల చర్చ. తనను రెండోసారి ఎంపీగా కాకుండా చూసేందుకు, కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా పనిచేశారని గతంలో సదరు ఎంపీ తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట. అదే నిప్పు పాటిల్‌లో రగులుతోందట.
రెండోసారి ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి, ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో పర్యటించింది వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు అంటున్నారు కార్యకర్తలు. సదరు ఎంపీని ఎమ్మెల్యేలు కేర్ చేయడం లేదనే టాక్ కూడా ఉంది. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సి ఉన్నా.. పిలవడం లేదట. సదరు ఎంపీ సైతం పిలవని పేరంటానికి తానెందుకు వెళ్లాలని.. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో వచ్చే మరో మూడు నియోజకవర్గాలైన, జహీరాబాద్, ఆంథోల్, నారాయణ్‌ఖేడ్‌లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
కొందరు ఎమ్మెల్యేలు.. ఎంపీని లెక్కచేయకపోవడానికి కారణాలూ ఉన్నాయట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను ఎంపీ నిర్లక్ష్యం చేశారని కొందరు ఎమ్మెల్యేలు నారాజ్‌లో ఉన్నారట. తమ గెలుపు కోసం కొంచెం కూడా కష్టపడలేదట. ఇలా కొందరు ఎమ్మెల్యేలు మనస్సులో పెట్టుకుని సదరు ఎంపీతో కోల్డ్‌వార్‌కు తెరలేపారనే మాటలు వినపడుతున్నాయి. ఒక దశలో ఎంపీ టికెట్టు బీబీ పాటిల్ కు ఇవ్వొద్దని అధిష్ఠానాన్ని కోరారని అప్పట్లో ప్రచారం కూడా జరిగిందట. కామారెడ్డి జిల్లాలోకి రాకపోవడానికి అదీ ఓ కారణం అనే గుసగుసలు సైతం పార్టీలో వినిపిస్తున్నాయట.
ఒకే పార్టీలో ఉన్నా..ఉత్తర-దక్షిణధృవాల్లా మారిన నేతలను ఒక్కతాటిపైకి తేవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. గ్యాప్ పూడిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ది అవుతుందని సీనియర్ నేతలంటున్నారు. అధిష్ఠానం చొరవ తీసుకుని ఆ గ్యాప్ పూడ్చాలని కోరుతున్నారు. చూడాలి, ఎమ్మెల్యేలు-ఎంపీల మధ్య సయోధ్య ఎప్పుడు కుదురుతుందో..