ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత పోరు అర్వింద్‌ బ్రదర్స్‌ మధ్య అగ్గి రాజేస్తోందా?

Update: 2020-06-18 11:18 GMT

ఆ ఎన్నిక.. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతోందా..? ఒకప్పుడు పాలు- నీళ్లలా కలిసి ఉన్న ఆ నేతలు ఇప్పుడు ఉప్పు- నిప్పులా ఉరుముకుంటున్నారా...? తండ్రికి తగ్గ తనయులుగా రాజకీయాల్లో రాణిస్తూ.. వేర్వేరు పార్టీలో కొనసాగుతున్న ఆ బ్రదర్స్ కు .. తాజా ఎన్నిక అగాదం సృష్టించిందా...? ఇందూరు లో ఆ నేతల కయ్యానికి కారణాలేంటి..? బీజేపీని బలహీనం చేసేందుకు ఆ మాజీ ఎంపీ వదిలిన అస్త్రం ఏంటి ..? సోదరుడు రంగంలో దిగడం ఆ ఎంపీని ఇబ్బందుల్లో నెట్టే అవకాశం ఉందా....? ఇందూరు పాలిటిక్స్ లో ఆప్ ది రికార్డ్ జరుగుతున్న చర్చేంటి.....?

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. ఇద్దరూ అన్నదమ్ములు. రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ తనయులు. అర్వింద్ బీజేపీ, సంజయ్‌ టీఆర్ఎస్‌, ఈ సోదరుల మధ్య స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అగ్గిరాజేసింది. ఈ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవితను గెలిపించేందుకు గులాబీ పార్టీ, ధర్మపురి సంజయ్ ని రంగంలోకి దించిందన్న వాదన, మంటలు రేపుతోంది.

తన సోదరుడు ఎంపీ అర్వింద్‌కు చెక్ పెట్టేందుకు, ధర్మపురి సంజయ్ రంగంలోకి దిగి బీజేపీ కార్పొరేటర్లకు గాళం వేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు మొదలు పెట్టేశారట. ఆ ప్రయత్నంలో ఈపాటికే నలుగురు కార్పొరేటర్లు కమలం పార్టీ వీడి, కారెక్కేశారట. నలుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్ గూటికి చేర్చడంలో సంజయ్ కంటే లోకల్ ఎమ్మెల్యే పాత్ర ఉన్నా మిగతా వారిని రప్పించేందుకు సంజయ్ చక్రం తిప్పుతున్నారట. తనకున్న పాత పరిచయాలతో వారిని కలుస్తూ, కారు ఎక్కించే పనిలో ఉన్నారట. భారీగా తాయిలాలు ఇచ్చేందుకు సైతం రెడీ అయ్యారట. ఎంపీ ధర్మపురి అర్వింద్ దూకుడుకు చెక్ పెట్టేందుకు గులాబీ పార్టీ, సోదరుడినే అస్త్రంగా వదలడంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, జిల్లాలో పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందట. ఎంపీ అర్వింద్ దూకుడు పెంచి అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారారట. అర్వింద్ దూకుడుకు స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలతో చెక్ పెట్టాలని గులాబీ పార్టీ స్కెచ్ వేసిందట. పార్లమెంట్‌ ఎన్నికలో ఓటమికి కసిగా బదులివ్వాలని డిసైడయ్యిందట.

అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉండటంతో, ఈ ఎన్నికలపై రాష్ట్రస్థాయిలో ఆసక్తి నెలకొంది. కవిత గెలుపు నల్లేరు మీద నడకలా ఉన్నా ఎందుకైనా మంచిదని ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందట గులాబీ పార్టీ. కార్పొరేషన్ లో బలంగా ఉన్న బీజేపీని బలహీన పరిచేందుకు కనీసం 10 మంది బీజేపీ కార్పొరేటర్లను టీఆర్ఎస్ లో చేర్చడం లక్ష్యంగా, మాజీ మేయర్ సంజయ్ ని రంగంలోకి దింపారట. విషయం తెలుసుకున్న ఎంపీ అర్వింద్ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి తగిన భరోసా ఇచ్చారట. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కవిత కు ఇబ్బందులు పెట్టేందుకు ఎన్నికల అఫిడవిట్లో తప్పులు వివరాలు ఇచ్చారని కవితపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారట. ఇలా ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేస్తుండగా, అది కాస్తా సోదరుల మధ్య వార్ కు దారితీస్తోందట.

మాజీ ఎంపీ కవితను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు ధర్మపురి సంజయ్ ఆపరేషన్ ఆకర్ష్‌లో కీలక పాత్ర పోషిస్తుంటే, ఆమె ఓటమే లక్ష్యంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ పావులు కదపుతున్నారు. ఈ అన్నదమ్ముల పోరులో, వాళ్ల తండ్రి రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ మద్దతు ఎవరికి ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. సంజయ్ యాక్టివ్ కావడం కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం మింగుడు పడకపోవడం కొసమెరుపు. 

Full View


Tags:    

Similar News