Hyderabad: ఖాళీగానే చక్కర్లు కొడుతున్న డబుల్ డెక్కర్ బస్సులు.. ‘ఫ్రీ’ అని తెలుసా..?!

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు ప్రత్యేక ఆకర్షణ. ఆ పాత మధురాలను గుర్తుచేస్తూ.. జీహెచ్‌ఎంసీ(GHMC) ఇటీవల నగరంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టింది.

Update: 2024-12-13 01:43 GMT

Hyderabad: ఖాళీగానే చక్కర్లు కొడుతున్న డబుల్ డెక్కర్ బస్సులు.. ‘ఫ్రీ’ అని తెలుసా..?!

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు ప్రత్యేక ఆకర్షణ. ఆ పాత మధురాలను గుర్తుచేస్తూ.. జీహెచ్‌ఎంసీ(GHMC) ఇటీవల నగరంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టింది. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ బస్సులను ప్రస్తుతం పర్యాటకులు లేక అలంకార ప్రాయంగా తిరుగుతున్నాయి. ఈ బస్సులను బయటి నుంచి చూసి ఆనందపడుతున్నారే తప్ప.. ఎక్కడం లేదు. దీంతో ఆదరణకు నోచుకోక ఖాళీగా తిరుగుతున్నాయి. ప్రవేశపెట్టారే తప్ప సరైన ప్రచారం నిర్వహించడం లేదనే విమర్శలు ఎదురవుతున్నాయి.

నగరానికి తలమానికం మన ట్యాంక్‌బండ్ హైదరాబాద్(Hyderabad) మణిహారంగా పిలుచుకునే ఈ సాగరం బుద్దుడి బొమ్మతో.. చూడచక్కటి వాతావరణాన్ని ఆవరించుకుంది. అయితే ఇప్పటివరకూ ఈ సాగరాన్ని చాలా మంది బైక్‌పై.. కార్లలోనూ చుట్టూ తిరిగి చూశారు. కానీ ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సుల్లో ఓ ఎత్తునుంచి సాగరసోయగాలను ఆస్వాదించే అవకాశం ఉన్నా ప్రయాణికులు దాన్ని వినియోగించుకోవడం లేదు.

హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్సుల(Double Decker Buses)కు ఆదరణ కరువైంది. ఈ బస్సులు అందుబాటులోకి వచ్చి చాలా రోజులు అయ్యింది. ఈ బస్సుల్లో ఫ్రీగానే తిరగొచ్చ అనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ వెంట తరచూ ఖాళీగా తిరుగుతున్నాయి. ఒక్కో బస్సును 2 కోట్ల చొప్పున ఏడాది క్రితం టెండర్ల విధానంలో HMDA కొనుగోలు చేసింది. మొత్తం 6 బస్సులకు కలిపి 12 కోట్ల వరకు ప్రజాధనం ఖర్చు చేశారు. వాటి నిర్వహణ బాధ్యతలను అయిదేళ్ల పాటు గుత్తేదారు సంస్థే చూడనుంది. ఈ బస్సులను ప్రస్తుతం ఏంచేయాలో తెలియకపోవడంతో హుస్సేన్ సాగర్ చుట్టూ ఖాళీగా చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో 2009కి ముందు సైతం డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. అప్పుడు ఛార్జీలు వసూలు చేశారు. కానీ నేటి తాజా ప్రభుత్వం వీటిపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదు. పైగా.. అప్పటి బస్సులతో పోల్చితే.. అత్యాధునిక టెక్నాలజీ.. ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో.. వీటిని వినియోగించుకుంటే ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయి. ప్రతి డబుల్ డెక్కర్ బస్సులో కింది భాగంతోపాటు పైన కూడా కలిపి 65 మంది కూర్చొని ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. దుమ్ము, ధూళి లోపలికి రాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో నగర అందాలను తిలకించేలా పర్యాటకుల కోసం వాటిని కేటాయిస్తామని గతంలోనే అధికారులు ప్రకటించారు.

సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ పార్కుల దగ్గర ఈ ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ పాయింట్లు సైతం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం డబుల్ డెక్కర్లను అక్కడి వరకే పరిమితం చేశారు. అడపాదడపా నగరంలోని ఇతర ప్రాంతాలకు.. హైటెక్ సిటీ, వేవ్ రాక్ వరకూ రోడ్లపై తిప్పుతున్నా అధికారులు ఆశించినంతగా ఈ డబుల్ డెక్కర్ బస్సులను ప్రయాణికులు ఉపయోగించడం లేదు.

డబుల్ డెక్కర్ బస్సుల రాకపోకలకు ఇబ్బందులేని మార్గాలను గుర్తించి ఒక ప్రత్యేక రూట్లలోనే నడుపుతున్నా సరైన ఆదరణకు నోచుకోలేకపోతోంది. డబుల్ డెక్కర్ బస్సు కావడం... పైగా ఏసీ బస్సు రూపురేకలు ఉండటంతో... దీనికి ఛార్జీలు ఉంటాయని.. ప్రయాణికులు ఎవరూ డబుల్ డెక్కర్‌ వైపే చూడటం లేదు. ఏ సమయాల్లో తిరుగుతాయో.. షెడ్యూల్ లేకపోవడం.. ఫ్రీ అని ప్రజలకు తెలియకపోవడం.. వంటివాటి వల్ల డబుల్ డెక్కర్‌ బస్సులను ప్రయాణికులు చేరదీయటం లేదు.

దీనికి తోడు ఎక్కువ ట్యాంక్‌బండ్ మార్గాల్లోనే తిరిగడం కూడా ఓ మైనస్‌పాయింట్‌గా మారింది. ఈ బస్సులపై అవగాహన లేక చాలా మంది ఎక్కడం లేదన్నది సర్వత్రా వినిపిస్తున్న మాటలు. ఈ సమస్యలను సరిదిద్దకుండా..అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కోట్లు పెట్టి కొన్నా.. డబుల్ డెక్కర్లు నగర ప్రయాణికుల ముందు అలంకారప్రాయంగా మారాయి.

ప్రజల కోసం కోట్లు వెచ్చించి కొన్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఉన్నతధికారులు స్పందించి.. ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఉచితమని.. ఎలాంటి ఛార్జీ వసూలు చేయరని.. ప్రజల్లోకి అవగాహన కల్పించాలని.. ఇంకా ఇతర రూట్లలోనూ ఈ బస్సులను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

Tags:    

Similar News