ఓటర్ల కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక యాప్

* మొబైల్ ఫోన్లలోనే ఓటర్ స్లిప్‎లను డౌన్‎లోడ్ చేసుకునే అవకాశం * పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకునేలా మొబైల్ యాప్‌ * మై జీహెచ్ఎంసీ యాప్‎లో నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్ * గూగుల్ మ్యాప్ లొకేషన్ ద్వారా పోలింగ్ బూత్ వివరాలు

Update: 2020-11-29 11:00 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. సాయంత్రానికి ప్రచార పర్వం ముగియనుంది. ఇప్పటి వరకు ప్రచారంతో బిజీగా గడిపిన అభ్యర్థులు ఇప్పుడు ఓటర్లకు స్లిప్పుల పంపిణీకి సద్దమవుతున్నారు. అయితే అభ్యర్థులతో పనిలేకుండా ఓటర్లే స్లిప్పులను డౌన్‎లోడ్ చేసుకునే విధంగా ఓ యాప్‎కు రూపకల్పన చేశారు అధికారులు దానికి తోడు ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా మరో 18 గుర్తింపు కార్డులు తీసుకురావచ్చని గుడ్ న్యూస్ చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేవారు తమ ఓటరు స్లిప్‌ను పొందడంతో పాటు మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్ కూడా వచ్చే యాప్‌ను జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూపొందించింది. ఇప్పటికే నగరంలోని ఓటర్లకు ఓటరు స్లిప్‌లను పంపిణిని జీహెచ్ఎంసీ చేపట్టింది. అయితే, నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్ ఫోన్‌లు ఉండడం వల్ల అర చేతిలోనే ఓటరు పోలింగ్ బూత్, ఓటర్ స్లిప్‌ను డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఈ మొబైల్ యాప్‌ను రూపొందించింది. 'మై జీహెచ్ఎంసీ' యాప్‌లో నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్లో క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్‌తో పాటు పోలింగ్ బూత్ ఎక్కడవుందో గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్ లో కనిపించేలా యాప్‎ను రూపొందించారు.

డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓట‌రు గుర్తింపు కార్డు లేకున్నా మరికొన్ని గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. ఓట‌రు గుర్తింపు కార్డు లేనివారు గుర్తింపు నిర్థార‌ణ‌కు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, ఫోటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిఫైకార్డ్‌, బ్యాంకు పాస్‌బుక్‌, పాన్ కార్డు, ఆర్‌.జి.ఐ, ఎన్‌.పి.ఆర్ స్మార్ట్ కార్డు, జాబ్ కార్డు, హెల్త్ కార్డు, పింఛ‌న్‌ డాక్యుమెంట్, ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎమ్మెల్సీల‌కు జారీచేసిన అధికారగుర్తింపు ప‌త్రం, రేషన్ కార్డు, కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం, ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు, ఆర్మ్స్ లైసెన్స్ కార్డు, అంగవైకల్యం సర్టిఫికేట్, లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు, పట్టదారు పాస్‎బుక్ లాంటి ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఏ ఒక్కటైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని లోకేష్ కుమార్ తెలిపారు.

ఇక ఈ నో-యువర్ పోలింగ్ స్టేషన్ యాప్ పై చైతన్యం కలిగించేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్ షెల్టర్ లపైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఎఫ్.ఎం. రేడియోలలో జింగిల్స్ ప్రసారం, టెలివిజన్ చానెళ్లలో స్క్రోలింగ్ లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే, ఈ యాప్ పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తున్నారు.

Tags:    

Similar News