గద్వాల జోగులాంబ దేవాలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తిపీఠం. మహినాన్విత శక్తులు కలిగిన ఈ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి వైభవంగా జరుగనున్నాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ అలంకారణలో భక్తులకు దర్శనమివ్వనుంది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు పూజలు ఆనతీ శ్రీకరణ, గణపతి పూజ, మహా కలశస్థాపనతో ప్రారంభం కానున్నాయి. అదే విధంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఆలయంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఇక మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిక రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేల కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు ఆలయ అధికారులు.
అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా భద్రాచల రామచంద్రస్వామి ఆలయంలో శనివారం నుంచి విజయ దశమి ఉత్సవాలు శోభాయమానంగా జరుగనున్నాయి. ఆలయంలో అమ్మవారికి తొలిరోజు ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు మహా నివేదన భోగభాగ్యం, 2 గంటలకు అలంకార దర్శనం, 3 గంటలకు లక్ష తులసి కుంకుమార్చన, రాత్రి 7 గంటలకు మంత్ర పుష్పం, 8 గంటలకు తిరువీధి సేవ నిర్వహించనున్నారు. ఇక ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారిని ఆదిలక్ష్మి రూపంలో అలంకరించనున్నారు. ఈ ఉత్సవాలను లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో అధికారులు నిర్వహించనున్నారు.
మరోవైపు నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా చదువుల తల్లి సరస్వతి దేవి శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనుంది. తొలిరోజుల ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి అర్చకులు కట్టెపొంగలి నైవేద్యం సమర్పించారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు తొమ్మిది రోజులపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి.
అదే విధంగా కాకతీయులు పాలించిన వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల్లో మొదటిరోజు భద్రకాలి అమ్మవారు బాలత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది.