Siddipet: సిద్దిపేట జిల్లాలో మామిడి టంకర్ల తయారీదారుల కష్టాలు
Siddipet: అకాల వర్షాలకు రంగుమారిన తయారు చేసిన టంకర్లు
Siddipet: తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. అనేక రకాల పంటలు నేలపాలయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వర్షాలకు.. మామిడి నేల రాలింది. అంతే కాదు మామిడిని నమ్ముకున్న మరికొందరిని మామిడి పంట నష్టాల పాలు చేస్తుంది. మామిడి టంకర్లు చేసి అమ్మే వారు సైతం అకాల వర్షాలకు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
మామిడి కాయల సీజన్ వచ్చిందంటే చాలు.. ఎంతోమంది ప్రజలు ఇళ్లల్లో నోరూరించే పచ్చళ్ళు పెడుతుంటారు. పచ్చళ్లతో పాటు ఇతర వంటకాలకు మామిడి సీజన్‌లో కాక... ఇతర కాలాల్లో కూడా ఉపయోగపడేలా మామిడి టంకర్లను తయారు చేస్తుంటారు కొందరు. అయితే అలాంటి కుటుంబాలే సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ గ్రామానికి సమీపంలో నివసిస్తున్నాయి. వీరు మామిడి సీజన్ లో మామిడి తోటలను కౌలుకు తీసుకుంటారు. తోటల నుంచి మామిడి కాయలను సేకరించి.. వాటిని కోసి ఆరబెట్టి టంకర్లుగా తయారు చేసి అమ్ముతుంటారు.
అయితే అలా తయారు చేసిన టంకర్లను చుట్టూ ప్రక్కల వారు మామిడి టంకర్లను కొనుగోలు చేసి... వాటిని మామిడి పచ్చళ్లు పెట్టడానికి ఉపయోగిస్తారు. ఇతర ప్రాంతాలకు కూడా వీటిని ఎగుమతి చేస్తుంటారు. రాఘవాపూర్ సమీపంలో కొన్ని కుటుంబాలు ఏళ్ల నుంచి మామిడి తోటలను కౌలుకు తీసుకొని మామిడికాయలు పచ్చళ్ళు పెట్టుకునే సమయానికి కాయలను టంకరగా తయారు చేసి ఇస్తుంటారు.
కాసిన కాయలన్ని అకాల వర్షాలకు రాలిపోయాయి. మిగిలిన కొన్ని కాయలతోనైనా టంకర్లు తయారు చేసి.. అమ్ముతామనుకుంటే అకాల వర్షాలు పడి... ఆర బెట్టిన మామిడి టంకర్లు సైతం రంగు మారిపోయి పాడయ్యాయి. మామిడి టెంకలు సిద్ధం చేసి ఎండలో ఆరబెట్టి చక్కగా సిద్ధం అయ్యేసరికి అకాల వర్షాలతో మామిడి టెంకలు అన్ని పాడు అయ్యాయని .. దీంతో తాము రెండు విధాలు గా నష్టపోయామంటున్నారు టంకర్లు తయారు చేసి అమ్ముకునే ఈ కుటుంబాలు. నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.