TSRTC: గ్రేటర్ పరిధిలో వెలవెల బోతున్న ఆర్టీసీ బస్సులు

TSRTC: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించేందుకు జనం వెనకడుగు వేస్తున్నారు.

Update: 2021-04-27 04:12 GMT

Greater RTC:(File Image) 

TSRTC: కరోనా వైరస్ కారణంగా ఎన్నో కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ రంగం, ఈ రంగం అనే ఏమీ లేదు. అన్ని రంగంల్లో భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీకి పెద్ద కష్టమొచ్చింది. ప్రగతి రథ చక్రాలు పరుగులు పెట్టలేకపోతున్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ఎఫెక్ట్‌ గ్రేటర్‌ ఆర్టీసీపై భారీగా పడింది. మార్చి వరకు బస్సుల్లో రోజూ 20 లక్షల మందికిపైగా ప్రయాణాలు సాగిస్తే ఏప్రిల్‌లో వారి సంఖ్య 12 లక్షలకు పడిపోయింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించేందుకు జనం వెనకడుగు వేస్తున్నారు. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో 29 డిపోల్లో 2,800 బస్సులుండగా వాటిలో 60 శాతం బస్సులు మాత్రమే రోడ్లపైకి వస్తున్నాయి.

గత నెల మార్చి వరకు 55.6 శాతంగా ఉన్న ప్రయాణికుల ఆక్యుపెన్సీ 35 శాతానికి పడిపోయిందని డిపో మేనేజర్లు చెబుతున్నారు. రద్దీ రూట్లల్లో ఉదయం, సాయంత్రం మాత్రమే బస్సుల్లో ప్రయాణికులుంటున్నారని, ఆ తర్వాత ఏ రూటులోనూ ప్రయాణికులు ఉండటం లేదని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు లేని రూట్లలో బస్సు ట్రిప్పులను రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వెల్లడించారు.

అంతే కాదు దీని కారణంగా ఆర్టీసీ ఛార్జీల మోత మోగే అవకాశం లేకపోలేదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనాకి ముందు ఓసారి భారీగా పెంచిన ఆర్టీసీ అధికారులు... మరోసారి పెంచేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కరోనా కారణంగా ప్రజలు సరిగా బస్సులు ఎక్కట్లేదనీ ఫలితంగా నిర్వహణ ఛార్జీలు, ఉద్యోగుల శాలరీలు చెల్లించడం కష్టం అవుతోందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉన్న నష్టాలు మరింతగా పెరిగిపోతుంటే... ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారు.

Tags:    

Similar News