తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరో నిర్ణయం.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి
Revanth Reddy: ఉ.10 గంటల నుంచి మ.ఒంటిగంట వరకు ప్రజావాణి
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌ను ఇకపై ప్రజావాణిగా పిలవాలని ఆయన ఆదేశించారు. ప్రజావాణిని ప్రస్తుతం సోమవారం మాత్రమే నిర్వహిస్తుండగా.. ఇకపై ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహిస్తామని చెప్పారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో.. ఈ నెల 8న ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజాభవన్‌కు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి సోమవారం వరకు మొత్తం 4 వేల 471 వరకు వినతులు ప్రభుత్వానికి అందాయి. అందులో ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పెన్షన్లకు సంబంధించిన వినతులే ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక.. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఒక వేయి 143 వినతి పత్రాలు అందాయని అధికారులు తెలిపారు.