ఆయన రాష్ట్రానికి మంత్రి అన్ని నియోజకవర్గాల్లో సుడి గాలి పర్యటనలు చేస్తారు. అందర్నీ కలుపుకుపోతారు. అవసరం ఉంటే తప్ప, ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టరు. అలాంటి మంత్రికి, ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గ పర్యటనపై రెడ్ సిగ్నల్ వేశారు. ఫలితంగా ఆ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు దర్జాగా వెళ్లొస్తున్నా ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికి అడుగు పెట్టలేదు మినిస్టర్. ఆన్ ద వే, ఆ నియోజకవర్గం నుంచి వెళ్తున్నా, కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదట. ఆ సెగ్మెంట్‌లో అడుగుపెట్టేందుకు మంత్రికి ఉన్న ఆంక్షలేంటి..? సదరు ఎమ్మెల్యే ఆహ్వానించకపోవడానికి ఉన్న అడ్డంకులేంటి? ఇందూరు గులాబీ పార్టీలో ఆ ఇద్దరి గురించి ఆఫ్ ది రికార్డుగా జరుగుతున్న చర్చేంటి.
నిజామాబాద్ జిల్లాలో ఓ మంత్రి- మరో ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ పీక్స్‌కు వెళుతోందన్న చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు పక్కపక్క నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులే అయినప్పటికి ఎడ ముఖం-పెడముఖంలా ఉంటారట. ఆ ఇద్దరిలో ఒకరు పార్టీ అధినేతకు విధేయునిగా ఉండగా మరొకరు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కు చాలా క్లోజ్ అనే టాక్ ఉంది.
గతంలో ఇసుక తవ్వకాల విషయంలో ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేకు సహాయ నిరాకరణ చేస్తే సాగునీటి విడుదల విషయంలో సదరు ఎమ్మెల్యే పక్క నియోజకవర్గానికి నీటిని ఆపేశారట. అలా ఆ రెండు నియోజకవర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరిగాయట. ఇలా చినికి చినికి గాలివానలా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిన్న గ్యాప్ కాస్తా ఇప్పుడు పూడ్చుకోలేనంతగా మారిందట.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఒకరి ఓటమి కోసం మరొకరు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని పార్టీలో టాక్ నడిచింది. కేసీఆర్ చరిష్మాతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. పార్టీ అధినేతకు విధేయునిగా ఉన్న ఓ నేతను మంత్రి పదవి వరించింది. ఇద్దరు రెండుసార్లు గెలిచారు. ఐతే ఒకరు మంత్రిగా జిల్లాలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంటే, సదరు ఎమ్మెల్యే మాత్రం ఆ మంత్రి తన నియోజకవర్గానికి రాకుండా ఆంక్షలు పెట్టారట.
బాల్కొండ నియోజకవర్గం నుంచి గెలిచిన ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో కీలక శాఖల బాధ్యతలు చూస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేశారట. మంత్రి పాల్గొనే కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం, నియోజకవర్గాలకు ఆహ్వానించకపోవడం చేశారట. ఐతే ఈ నోటా ఆ నోటా ఆ విషయం పార్టీ అధినేత చెవిన పడటంతో, అందర్నీ పిలిచి క్లాస్ పీకారట. దీంతో అప్పటి వరకు తమ నియోజకవర్గానికి వద్దన్న ఎమ్మెల్యేలు పార్టీ అధినేత క్లాస్ తో, సదరు మంత్రిని రా..రమ్మని ఆహ్వానించారట. ఇలా జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అడుగుపెట్టిన సదరు మంత్రి, ఆ ఒక్క నియోజకవర్గానికి మాత్రం ఇప్పటి వరకు వెళ్లలేదట. దీనికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి-మంత్రి ప్రశాంత్ రెడ్డిల మధ్య గతంలో ఉన్న గ్యాప్ కారణం అనే టాక్ నడుస్తోంది. జిల్లా అంతటా పర్యటిస్తున్న మంత్రి.. ఆ ఒక్క నియోజకవర్గానికి మాత్రం వద్దంటున్నారట. సదరు ఎమ్మెల్యే సైతం ఏ మంత్రి వచ్చినా ఓకే కానీ ఆయన మాత్రం వద్దంటున్నారట.
ఒక దశలో నేను మంత్రిని అంటే ఐతేంటి నేను సీనియర్ ఎమ్మెల్యేను అనే స్థాయిలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగిందని. పార్టీలో టాక్ ఉంది. ఆర్మూర్ నియోజకవర్గం మీదుగా నిజామాబాద్ కు వస్తున్న మంత్రి మళ్లీ అదే ఆర్మూర్ మీదుగా తన సొంత నియోజకవర్గం బాల్కొండకు వెళ్తున్నా అక్కడ మాత్రం ఆగడం లేదట. సదరు ఎమ్మెల్యే అనుచరులు సైతం ఏ పని ఉన్నా మంత్రి దగ్గరకు వెళ్లొద్దనే శపథం చేసుకున్నారట. ఎమ్మెల్యే ఆహ్వానించే వరకు అక్కడికి వెళ్లొద్దని సదరు మంత్రి సైతం గట్టి పట్టుదలతో ఉన్నారట.
రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి- ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మధ్య నెలకొన్న గ్యాప్ పూడ్చాలని పార్టీ శ్రేణులు అధిష్ఠానాన్ని కోరుతున్నారట. ఆ వివాదానికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుంది. ఆ నియోజకవర్గంలో మంత్రి ఎప్పుడు పర్యటిస్తారన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.