TSPSC: TSPSC కార్యాలయాన్ని ముట్టడించిన 2017 పీఈటీ అభ్యర్ధులు
TSPSC: 2017లో 616 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల
TSPSC: 2017 సంవత్సరంలో విడుదలచేసిన గురుకుల పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. టీఎస్పీఎస్సి కార్యాలయానికి చేరుకుంటున్న అభ్యర్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అబిడ్స్, నాంపల్లి పోలీసు స్టేషన్ లకు తరలించారు. తమకు సాయంత్రం వరకు పోస్టింగ్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ లో కొంతమంది అభ్యర్థులు బైఠాయించారు. 2017 సంవత్సరంలో విడుదల చేసిన గురుకుల పీఈటీ పోస్టులు ఇప్పటి వరకు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని అభ్యర్థులు మండిపడ్డారు.
2017లో 6వందల16 పోస్టులుతో విడుదల అయిన నోటిఫికేషన్ లో పరీక్ష రాసి 12వందల 32 మందిని ఎంపిక చేశారని తెలిపారు. మధ్యలో కోర్ట్ కేసులతో వాయిదా వేస్తూ.. ఆరు సంవత్సరాలు కాలయాపన చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కోర్ట్ కేసు పూర్తి అయినప్పటికీ టీఎస్పీఎస్సీ స్పందించటం లేదని అభ్యర్థులు వాపోయారు. వెంటనే 616 పోస్ట్ లను భర్తీ చేయాలని లేదంటే అభ్యర్ధులు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. కాగా అధికారులతో మాట్లాడేందుకు ఐదుగురు అభ్యర్థులను పోలీసులు టీఎస్పీఎస్సి కార్యాలయంలోకి అనుమతించారు.