బంగారు కొండపై నాసా చూపు.. వచ్చే ఏడాది అక్టోబరులో..

Golden Asteroid: ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ కోటీశ్వరుడు అయితే ఎలా ఉంటుంది?

Update: 2022-11-05 15:30 GMT

బంగారు కొండపై నాసా చూపు.. వచ్చే ఏడాది అక్టోబరులో..

Golden Asteroid: ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ కోటీశ్వరుడు అయితే ఎలా ఉంటుంది?... దీనికి సమాధానం ఏమో కానీ మరి పని చేసేవాళ్లు ఎవరు? అంటూ రివర్స్‌ ప్రశ్నిస్తారు. కానీ ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ సంపన్నులయ్యేంత బంగారం అంతరిక్షంలో ఉందంటోంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. మన సౌర కుటుంబంలోని ఓ బంగారు గ్రహశకలం చక్కర్లు కొడుతోంది. అందులో ఇనుము, నికెల్‌, బంగారం ఉన్నట్టు గుర్తించింది. దానిపై పూర్తి స్థాయి పరిశోధనలకు నాసా సిద్ధమైది. అక్కడికి వెళ్లేందుకు నాసా ముహూర్తం నిర్ణయించింది. 2023 అక్టోబరు 10న ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్టు తాజాగా వెళ్లడించింది. అసలు ఈ బంగారు గ్రహశకలం ఎక్కడ ఉంది? నాసా దాన్ని భూమి మీదకు తీసుకురాగలదా? నాసా ప్లాన్స్ ఏంటి?

గ్రహశకలం అంటే.. గ్రహాల నుంచి విడిపోయినవే. సౌర వ్యవస్థ ఏర్పడే సమయంలో రెండు గ్రహాలు ఒకదానికొకటి ఢీకొనడంతో వాటి నుంచి విడిపోయిన కొన్ని ముక్కలనే గ్రహశలాలుగా పిలుస్తారు. ఇలాంటివి మన సౌర వ్యవస్థలో లెక్కకు మించి ఉన్నాయి. అంగారకుడు, గురు గ్రహాల మధ్యన గ్రహ శకలాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి గ్రహాలు కొన్ని పలుమార్లు భూమిపైకి దూసుకొస్తున్నాయి. ఇటీవల అలా దూసుకొచ్చే గ్రహాల నుంచి భూమికి ఎలాంటి ముప్పు కలగకుండా అమెరికా అంతరిక్ష సంస్థ నానా చేపట్టిన డార్ట్‌ ప్రయోగం విజయవంతమైంది. గ్రహశకలాన్ని కృత్రిమ ఉపగ్రహంతో ఢీకొట్టి.. దాన్ని దారి మళ్లించి.. భూమివైపు రాకుండా చేయడంలో నాసా సక్సెస్‌ అయ్యింది. దీంతో భవిష్యత్తులో అస్టరాయిడ్లతో ప్రమాదాన్ని నివరించవచ్చని నాసా నిరూపించింది. మానవాళికి ఇక నుంచి గ్రహశకలాలతో ఎలాంటి ముప్పు ఉండదని భరోసా ఇచ్చింది. ఇప్పుడు అదే నాసా.. ఓ గ్రహ శకలంపై పరిశోధనకు ఉవ్విల్లూరుతోంది. అందుకు కారణం ఆ గ్రహ శకలంలో అత్యధికంగా బంగారం ఉండడమే. అందులో బంగారంతో పాటు నికెల్‌, ఇనుము కూడా ఉన్నట్టు గుర్తించింది. ఆ ఖనిజాల విలువను లెక్కిస్తే ప్రపంచ దేశాల సంపద కంటే రెట్టింపు విలువైనదని నాసా చెబుతోంది. దాన్ని భూమి మీదకు తీసుకువస్తే ప్రతి ఒక్కరూ కోటీశ్వరుడు కావచ్చని చెబుతోంది.

గురుడు, అంగారక గ్రహాల మధ్యన ఉన్న ఎన్నో ఆస్టరాయిడ్లలో బంగారు గ్రహశకలం ఒకటి ఉంది. బంగారు కొండగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్న ఈ గ్రహ శకలం 199 కిలోమీటర్ల వెడల్పులు ఉన్నట్టు నాసా గుర్తించింది. ఇది భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటలీకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు అన్నిబేల్‌ గస్పారిస్‌ 1852 మార్చి 17న ఈ అస్టరాయిడ్‌ను తొలిసారి గుర్తించాడు. గ్రీకుల ఆత్మదేవత సైకీ పేరును ఈ గ్రహశకలానికి పెట్టారు. ఈ పేరుకు నాసా 16ను జోడించింది. సైకీ 16గా పిలుస్తోంది. భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న '16 సైకీ‌'ను హబుల్‌ టెలిస్కో్‌పతో మొదటిసారి అత్యంత దగ్గరగా పరిశీలించినట్లు అమెరికాలోని సౌత్‌వెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా ఇనుము, నికెల్‌తోపాటు బంగారం, ప్లాటినం, రాగి ఇతర అరుదైన లోహాలు ఉన్నట్టు అంచనా వేశారు. దీనిలోని మూలకాల మొత్తం విలువ 10వేల క్వాడ్రిలియన్‌ డాలర్లు ఉండొచ్చని చెబుతున్నారు. అంటే మన రూపాయల్లో అయితే 7 లక్షల 40వేల కోట్లట. ఈ అస్టరాయిడ్‌లోని రవ్వంత ముక్క కూడా లక్షల కోట్ల విలువు చేస్తోందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే దీన్ని గోల్డ్‌మైన్‌ గ్రహశకలం అని కూడా పిలుస్తారు. ఇప్పటికే దీనిపై కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు కొంతమంది ప్రయోగాలు చేస్తున్నారు. ఈ గోల్డ్‌మైన్‌ గ్రహశకలంపై ఉష్ణోగ్రత ఎలా ఉంటుందన్న దానిపై స్టడీ చేస్తున్నారు.

సాధారణంగా సౌర కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలతో పాటు లెక్కలేనన్ని గ్రహ శకలాలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ మూలకాలతో కూడిన నేల, వాయువులు, మంచుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ సౌర కుటుంబంలో ఇప్పటివరకు గుర్తించిన అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లలో అన్నింటికన్నా 'సైకీ' భిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 'సైకీ' ఆస్టరాయిడ్‌లో ఎక్కువగా లోహాలతో కూడి ఉండడమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. సైకీ మీద ఉన్న లోహాలను భూమ్మీదికి తేగలిగితే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలంపై పరిశోధనకు నాసా నడుం బిగించింది. నిజానికి ఈ ఏడాది అక్టోబరులోనే ఈ మిషన్‌ను ప్రారంభించాల్సి ఉంది. అది సాప్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాల కారణంగా ఈ మిషన్‌ వాయిదా పడింది. తాజగా సైకీ‌ గుట్టు విప్పేందుకు నాసా ముహూర్తం నిర్ణయించి వివరాలను వెల్లడించింది. స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా 2023 అక్టోబరు 10న సైకిపైకి ఉపగ్రహాన్ని పంపాలని ప్లాన్‌ వేసింది. అన్నీ అనుకున్నట్టు సాగితే 2026 నాటికి ఈ మిషన్‌ సైకీపైకి చేరుకోనున్నది. అక్కడి మూలకాలను పూర్తి స్థాయిలో పరిశోధన చేసేందుకు ఈ మిషన్‌ ఉపకరిస్తుంది. అసలు అది గ్రహానికి చెందినది? ఎక్కడి నుంచి విడిపోయింది? అనే ప్రశ్నలకు సమాధానాలను మిషన్‌ ద్వారా కనిపెట్టే అవకాశం ఉంది.

అయితే నిజంగా బంగారాన్ని అంతరిక్షం నుంచి తీయగలమా? మన దగ్గర అంత సాంకేతికత ఉందా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అయినా మున్ముందు ఈ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలే అద్భుతమనుకుంటే నేడు గ్రహశకలాలను దిశను మార్చే స్థాయికి ఎదిగిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. అంతరిక్షంలో మనిషి ప్రయాణం చేయడానికి మరో 25 ఏళ్లు పట్టచొచ్చని చెబుతున్నారు. నిజానికి అంతరిక్షాన్ని అందుకోవడం అనేది రెండు కారణాల మీదే ఆధారపడుతోంది. ఒకటి ఆర్థిక వెసులుబాటు, రెండు మన స్పేస్‌ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్‌ కావడం. ఇవి రెండు సాధ్యమైతే సైకీ పైన ఉన్న బంగారాన్ని నేలకు దించడం పెద్ద సమస్య కాదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. సైకీ-16 గ్రహశకలాన్ని అందుకుంటే అంతరిక్షంలో బంగారు అన్వేషణకు ఇదే మొదటి దశ అవుతుంది. అలాగే భూమికి దగ్గరగా వెళ్లే గ్రహశకలాల్లో కూడా ఇతర ఖనిజాలను వెలికితీయవచ్చు. ముఖ్యంగా అరుదైన లోహాల వనరులను కలిగి ఉన్న చంద్రుడు తదుపరి అంతరిక్ష మైనింగ్ కార్యకలాపాలకు ప్రధానకేంద్రం అవుతాడు. ఇప్పటికే అంతరిక్ష మైనింగ్‌పై భారీ ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. మైనింగ్‌కు అనుగుణంగా స్పేస్‌క్రాఫ్ట్‌లను డిజైన్‌ చేయడంపై తలమునకలై ఉన్నారు. సైకీపై పరిశోధనతో వినూత్నమైన మార్పులు రానున్నాయి.

సైకీ-16తో అంతరిక్ష మైనింగ్‌కు మార్గం సుగమం కానున్నది. ఈ పోటీలో ఐరోపా, అమెరికా, రష్యాతో పాటు చైనా కూడా ముందున్నది. అయితే సైకీని ఏ దేశం ముందు అందుకుంటుందో అ దేశమే గోల్డ్‌మైన్‌ కింగ్‌ కాగలదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 

Tags:    

Similar News