Microsoft-ChatGPT: గూగుల్‌కి గుబులు పుట్టిస్తున్న మైక్రోసాఫ్ట్..!
Microsoft-ChatGPT: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కి కొత్తగా ఒక వణుకు పట్టుకుంది.
Microsoft-ChatGPT: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కి కొత్తగా ఒక వణుకు పట్టుకుంది. దీనికి కారణం టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. వాస్తవానికి ఎవరైనా ఏదైనా విషయం తెలియకపోతే గూగుల్ సెర్చ్ చేస్తారు. కానీ కొత్తగా దీనికి పోటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో దూసుకొచ్చిన చాట్ జీపీటీని వాడుతున్నారు. గూగుల్‌కి పోటీగా నిలుస్తోంది. దీంతో మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీ పేరెంట్ సంస్థ `ఓపెన్ ఏఐ` లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే మైక్రోసాఫ్ట్ 100 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. తాజాగా మరో 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై రెండు కంపెనీలు అధికారికంగా స్పందించలేదు. గతేడాది నవంబర్‌లోనే మార్కెట్ లోకి దూసుకొచ్చిన చాట్ జీపీటీ గూగుల్‌కు గట్టి పోటీనిస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలువురు నెటిజన్లు తమకు తెలియని విషయాల కోసం చాట్ జీపీటీని ఆశ్రయిస్తున్నారు. దీంతో గూగుల్‌కి ఇది పెద్ద సమస్యగా తయారైంది.
ఓపెన్ ఏఐ కంపెనీలోని షేర్ హోల్డర్ల షేర్లను విక్రయించాలని నిర్ణయించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం వచ్చింది. ఈ కంపెనీ విలువ 29 బిలియన్ డాలర్లు ఉన్నట్లు సమాచారం. ఈ వాటాదారుల షేర్ల విక్రయం కోసం మైక్రో సాఫ్ట్‌తోపాటు పలు వెంచర్ క్యాపిటల్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇరు సంస్థల మధ్య చర్చలు ఫలిస్తే ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్‌కు 49 శాతం, ఇతర ఇన్వెస్టర్లకు మరో 49 శాతం వాటాలు దక్కుతాయని అంచనా. చాట్ జీపీటీని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో రూపొందించారు. 2015లో శామ్ ఆల్ట్‌మాన్, ఎలన్ మస్క్ 100 కోట్ల డాలర్లతో ఈ సంస్థను ప్రారంభించారు.