Highest Paid Cricketer: కోహ్లీ, రోహిత్ కాదు.. అత్యధిక సాలరీ పొందే టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా?
Highest Paid Cricketer: గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించే అందరూ చర్చిస్తున్నారు.
Highest Paid Cricketer: గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించే అందరూ చర్చిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలోకి వచ్చినప్పటి నుంచి పంత్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. అందరూ ఊహించినట్టే వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్ ప్రాంచైజీ అతడిని ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్.. ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ (రూ.24.75) ధరను అధిగమించాడు. ఐపీఎల్‌లో అత్యధిక ధర పలకడంతో స్టార్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా పంత్ అధిగమించాడు.
ఇప్పుడు భారతీయ ఆటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్ రిషబ్ పంత్ కావడం విశేషం. ఐపీఎల్, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కలిపి రూ.30 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా రూ.27 కోట్లు, బీసీసీఐ కాంట్రాక్టు ద్వారా రూ.3 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఏడాదికి రూ.28 కోట్లు ఆర్జిస్తుండగా.. ఐపీఎల్ ద్వారా రూ.21 కోట్లు (ఆర్సీబీ), బీసీసీఐ నుంచి రూ.7 కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే అడ్వటైజ్‌మెంట్స్ కలిపితే విరాట్ టాప్‌లో ఉన్నాడు. విరాట్ పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ తర్వాత జస్ప్రీత్ బుమ్రా (రూ.25 కోట్లు) ఉన్నాడు. ముంబై ఇండియన్స్ అతడిని రూ.18 కోట్లకు రిటైన్ చేసుకోగా.. బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా రూ.7 కోట్లు గడిస్తున్నాడు. ఈ లిస్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రూ.25 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రూ.23.3 కోట్లతో టాప్-5లో ఉన్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లు పలికినా.. ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కలిగి లేనందున అతడు టాప్-5లో లేడు.
టాప్ 5 లిస్ట్ ఇదే:
1.రిషబ్ పంత్ - 30 కోట్లు
2.విరాట్ కోహ్లీ - 28 కోట్లు
3.జస్ప్రీత్ బుమ్రా - 25 కోట్లు
4.రవీంద్ర జడేజా - 25 కోట్లు
5.రోహిత్ శర్మ - 23.30 కోట్లు