Priyansh Arya: కోహ్లీకి వీరాభిమాని.. టాప్‌ ట్రెండింగ్‌లో ప్రియాన్ష్‌ ఆర్య..!

Priyansh Arya: 2019లో అండర్-19 భారత జట్టుతో పాటు యశస్వి జైశ్వాల్, రవి బిష్ణోయ్‌లతో కలిసి ఆడాడు.

Update: 2025-04-09 15:20 GMT
Priyansh Arya

Priyansh Arya: కోహ్లీకి వీరాభిమాని.. టాప్‌ ట్రెండింగ్‌లో ప్రియాన్ష్‌ ఆర్య..!

  • whatsapp icon

Priyansh Arya: ప్రియాన్ష్ ఆర్య పేరు ఇప్పుడు ఐపీఎల్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటివరకు కెరీర్‌లో నాలుగు మ్యాచ్‌లే ఆడినప్పటికీ, తన హిట్టింగ్‌తో అభిమానులను కట్టిపడేస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మొదటి మ్యాచ్‌లోనే 22 బంతుల్లో 47 పరుగులు చేయడంతో తన ప్రతిభను చాటుకున్న ప్రియాన్ష్ ఆర్య, ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో తడబడినా, చెన్నైపై జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. 42 బంతుల్లో 103 పరుగులు బాదడంతో అందరి దృష్టి తనపైనే నిలిపేశాడు.

చెన్నై బౌలింగ్‌ను చీల్చిచెదీయడంతో పాటు, పవర్ ప్లేలోనే అర్ధశతకం, తర్వాత శతకం పూర్తి చేస్తూ మ్యాచ్ మూడ్ మార్చేశాడు. 7 ఫోర్లు, 9 సిక్సులతో 245 స్ట్రైక్ రేట్‌తో ఆడిన ప్రియాన్ష్ ఇన్నింగ్స్‌కు పంజాబ్ భారీ స్కోరు సాధించగలిగింది. పైగా ఆ మ్యాచ్‌లో పంజాబ్ వికెట్లు వరుసగా కోల్పోయినా, ఒక వైపు నిలబడుతూ జట్టు గౌరవాన్ని కాపాడినది ప్రియాన్ష్ బ్యాటింగే.

2001 జనవరిలో ఢిల్లీలో జన్మించిన ప్రియాన్ష్ చిన్నతనంలోనే బ్యాట్ పట్టాడు. అతడి తల్లిదండ్రులు పవన్, రాధా ఇద్దరూ టీచర్లే అయినా, తమ కుమారుని కలను ముందుకు నడిపించారు. 2019లో అండర్-19 భారత జట్టుతో పాటు యశస్వి జైశ్వాల్, రవి బిష్ణోయ్‌లతో కలిసి ఆడాడు. 2021లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2023లో లిస్ట్-ఎ డెబ్యూకి కూడా అర్హత సాధించాడు. అసలు అతడి పేరు ఒక్కసారిగా వెలుగులోకి రావడమంటే ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో చూపిన సూపర్ షోనే కారణం. ఆ టోర్నీలో ఒక మ్యాచ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదడంతో క్రికెట్ ప్రపంచం అతడిని గుర్తించింది. మొత్తం 608 పరుగులతో 198 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు.

Tags:    

Similar News