IPL 2025: ధోనీ గ్రౌండ్‌లోకి వస్తున్నా వ్యూయర్‌షిప్ పెరగడంలేదు.. మహేంద్రుడి సీన్ అయిపోయిందా?
చెన్నై సూపర్ కింగ్స్ పదేపదే చేస్తున్న పొరపాట్లు, టీమ్ సెటిలవకపోవడం, ధోని మళ్లీ కెప్టెన్సీ తీసుకోవడం, బౌలింగ్ విఫలం కావడం లాంటివి జట్టుని బాగా దెబ్బతీశాయి.

IPL 2025: ధోనీ గ్రౌండ్‌లోకి వస్తున్నా వ్యూయర్‌షిప్ పెరగడంలేదు.. మహేంద్రుడి సీన్ అయిపోయిందా?
IPL 2025: సిక్సర్ల బాదుడుతో ధోనీ, క్రిస్ గేల్‌ను మించి నిలిచాడు రోహిత్ శర్మ. బూమ్ బూమ్ బుమ్రా కూడా జట్టులో ఉన్నాడు. ఇలా చూస్తే, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అన్నీ స్టార్ ప్లేయర్లతో నిండిపోయి ఉన్నటే లెక్కా. వాంఖేడే స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడతాయని తెలిసిన దగ్గర నుంచి, అభిమానులు టీవీల ముందు ఎగిరి గంతేసి కూర్చుంటారనుకున్నారు. కానీ... సీన్ రివర్స్ అయింది. చెన్నై ఘోర పరాజయాలతో అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మీ ఆట మేము చూడమంటూ తెగేసి చెప్పేశారు. ఒకప్పుడు వాంఖేడే స్టేడియంలో చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ అంటే సగం ముంబై జెండాలు, సగం చెన్నై జెండాలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడంలేదు. చెన్నై చెత్త బ్యాటింగ్‌తో స్టేడియంలో ఉన్న కొన్ని పసుపు జెండాలు కూడా మాయమైపోయాయి. వాంఖేడే స్టేడియాన్ని పూర్తిగా బ్లూ వేవ్ కవర్ చేసేసింది.
ఇక ఎల్ క్లాసికో అంటూ అభిమానులు ఎంతగా హైప్ ఇచ్చినా, నిన్నటి మ్యాచ్ ఒక విషయాన్ని మాత్రం క్లియర్ చేసింది. IPLలో ఎంటర్టైనింగ్ మ్యాచ్‌లకు చెన్నై టీమ్ ఇప్పుడు కేరాఫ్ కానే కాదుజ ముంబై తమ బ్రాండ్ క్రికెట్‌కు దగ్గరగా రావడంతో, చెన్నై మాత్రం పూర్తిగా చతికిలపడిపోయింది. మ్యాచ్ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూసినవారే ఎక్కువగా కనిపించారు. హాట్‌స్టార్‌లో వ్యూయర్‌షిప్ నంబర్లు కూడా చెన్నై-ముంబై మ్యాచుల పాపులారిటీ తగ్గినట్టు చెబుతున్నాయి. సాధారణంగా టాప్ జట్లు తలపడితే.. 30 కోట్ల వ్యూస్ వస్తాయి. కానీ నిన్న ధోని బ్యాటింగ్‌కి వచ్చినా, 20 కోట్లను కూడా దాటలేదు. చెన్నై జట్టు కష్టపడి చేసిన 176 పరుగుల టార్గెట్‌ను ముంబై తేలిగ్గా చేజ్ చేసి పడేసింది. రోహిత్, సూర్య ఫామ్‌లోకి రావడంతో ఛేజింగ్ ఈజీగా సాగిపోయింది. ఎలాగో మ్యాచ్ గెలిచేశాం అంటూ ముందుగానే సంబరాల్లో మునిగిపోయారా, లేదా రానున్న సోమవారం.. లేట్‌గా వెళితే బాస్ చివాట్లు పెడతాడేమోననే భయమా ఏమో గాని...ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉండిపోయారు.
ఇలా చూస్తే, చెన్నై - ముంబై మ్యాచ్‌లకు మునుపటి గ్లోరీ లేదనే చెప్పవచ్చు. ఇదే కొనసాగితే.. 'ఆ రోజుల్లో మా చెన్నై-ముంబై మ్యాచుల కోసం రక్తాలు చిందించాం.. మీకేం తెల్సు మా ఫ్యానిజం..' అంటూ చెప్పుకునే పరిస్థితి రావచ్చు. ఇక IPLలో ఈ రెండు జట్ల బ్రాండ్ వెల్యూస్ పెరుగుతున్నా.. చెన్నై సూపర్ కింగ్స్ పదేపదే చేస్తున్న పొరపాట్లు, టీమ్ సెటిలవకపోవడం, ధోని మళ్లీ కెప్టెన్సీ తీసుకోవడం, బౌలింగ్ విఫలం కావడం లాంటివి జట్టుని బాగా దెబ్బతీశాయి. 11 మంది ఎఫెక్టివ్ ప్లేయర్లను గ్రౌండ్‌లోకి దింపలేకపోవడం, ట్రెండ్‌లను ప్రభావితం చేస్తోంది. వ్యూస్ తగ్గమంటే తగ్గవా మరి!