CSK vs DC Match: ఆర్ అశ్విన్‌ను పక్కనపెట్టొద్దు... CSK కు శ్రీకాంత్ సలహా

CSK vs DC Match: ఆర్ అశ్విన్‌ను పక్కనపెట్టొద్దు... CSK కు శ్రీకాంత్ సలహా
CSK vs DC Match: ముంబై ఇండియన్స్‌తో సమానంగా ఐదు సార్లు ఐపిఎల్ ట్రోఫీ టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరహాలోనే ఉంది. ఈ ఐపిఎల్ 2025 ఆరంభంలో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆ తరువాత వరుసగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్ల చేతిలో ఓడిపోయింది. ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలవడంతో పాయింట్స్ పట్టికలో 2 పాయింట్స్‌తో 7వ స్థానంలో కొనసాగుతోంది.
వరుస ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుతం లోపాలను రివ్యూ చేసుకుంటోంది. వచ్చే శనివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఎలాంటి ప్లాన్‌తో ముందుకు వెళ్లాలా అనే విషయంలో చెన్నై ఫ్రాంచైజీ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఆటగాడు క్రిష్ శ్రీకాంత్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఒ సలహా ఇచ్చాడు.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వేధిస్తోన్న సమస్యల్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కాంబినేషన్ ఒకటి. అలాగే పవర్‌ప్లేలో బౌలింగ్‌లోనూ లోపాలు ఉన్నాయి. ఇదే విషయమై శ్రీకాంత్ స్పందిస్తూ ఓపెనర్ జేమి ఓవర్టన్ స్థానంలో డెవన్ కాన్వెను దింపాల్సిందిగా సూచించాడు.
ఇక బౌలింగ్ విషయానికొస్తే... రవిచంద్రన్ అశ్విన్ పక్కకు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. కాకపోతే పవర్ ప్లేలో అశ్విన్‌కు బౌలింగ్ ఇవ్వకూడదని సూచించారు. 7వ ఓవర్ నుండి 18 ఓవర్ల మధ్య అశ్విన్ బాగా బౌల్ చేయగలడని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచుల్లో అశ్విన్ కేవలం 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అందుకే అశ్విన్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో శ్రీకాంత్ ఈ సలహా ఇచ్చాడు. అలాగే త్రిపాఠిని పక్కనపట్టి కంబోజ్‌ను తీసుకోవచ్చని అన్నారు.
శివం దూబేను కూడా జట్టులోకి తీసుకుని ఆండ్రూ సిద్ధార్థ్‌ని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవచ్చని స్పష్టంచేశారు. చెన్నై సూపర్ కింగ్స్ మనసులో ఏముందో, శ్రీకాంత్ చెప్పిన సలహా వారికి నచ్చుతుందో లేదో తెలియదు. వారి ప్లాన్ ఏంటి? ఢిల్లీ జట్టును ఎలా ఎదుర్కోబోతోంది అనేది తెలియాలంటే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయ్యే వరకు వేచిచూడాల్సిందే.