IND vs ENG 2nd Test: నేటి నుంచి ఇంగ్లాండ్‌తో భారత్‌ రెండో టెస్ట్

IND vs ENG 2nd Test : ఒత్తిడిలో రోహిత్ సేన.. మంచి ఊపులో ఇంగ్లాండ్

Update: 2024-02-02 02:07 GMT

IND vs ENG 2nd Test: నేటి నుంచి ఇంగ్లాండ్‌తో భారత్‌ రెండో టెస్ట్ 

IND vs ENG 2nd Test : నాలుగేళ్ల తర్వాత విశాఖపట్నంలోని వైఎస్సార్‌ ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో మరో టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి టెస్టులో ఓటమితో ఒత్తిడి ఎదుర్కొంటున్న టీమ్‌ఇండియా.. బజ్‌బాల్‌ ఆటతో సిరీస్‌లో శుభారంభం చేసిన ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఇవాళ ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభమవుతుంది. మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ భారత్‌ 28 పరుగుల తేడాతో ఓడింది. రెండో టెస్టులో గెలవాలంటే భారత బ్యాటింగ్‌ మెరుగుపడాలి. గత మ్యాచ్‌లో రాణించిన జడేజా, రాహుల్‌ లేకపోవడం జట్టుకు దెబ్బే. విశాఖలో టెస్టుల్లో అజేయ రికార్డును భారత్‌ కొనసాగించాలంటే ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి చివరి వరకూ పట్టు వదలకుండా పోరాడాల్సి ఉంటుంది. ప్రత్యర్థి స్పిన్నర్లకు అడ్డుకట్ట వేయడం కోసం మన బ్యాటర్లు స్వీప్‌ షాట్లపై దృష్టి పెట్టి, నెట్స్‌లో ఎక్కువగా సాధన చేశారు.

తుది జట్టులోకి వచ్చేందుకు రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ మధ్య గట్టిపోటీ ఉంది. రజత్‌ భారత్‌ తరపున ఒక వన్డే ఆడాడు. సర్ఫరాజ్‌ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. ఎర్రబంతి క్రికెట్‌ విషయానికి వస్తే దేశవాళీల్లో ఈ ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు. గురువారం ఐచ్ఛిక ప్రాక్టీస్‌ సెషన్‌ అయినప్పటికీ ఈ ఇద్దరు నెట్స్‌లో చెమటోడ్చారు. వీళ్లలో ఒకరు టెస్టు అరంగేట్రం చేయడం ఖాయమే. కోహ్లి స్థానంలో తొలి టెస్టుకు ముందే జట్టులోకి వచ్చిన రజత్‌కే ఛాన్స్‌ దక్కేలా కనిపిస్తోంది. జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు కుల్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌ రేసులో ఉన్నారు. స్పెషలిస్టు స్పిన్నర్‌ కావాలనుకుంటే కుల్‌దీప్‌నే ఆడించొచ్చు. బ్యాటింగ్‌ బలం కావాలంటే సుందర్‌ను తీసుకోవచ్చు. ఇంగ్లాండ్‌ లాగా భారత్‌ కూడా ఒకే పేసర్‌ను ఆడించాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. అప్పుడు సిరాజ్‌ పెవిలియన్‌కే పరిమితమైతే.. కుల్‌దీప్‌, సుందర్‌ ఇద్దరూ ఆడతారు.

విశాఖ పిచ్‌ స్పిన్నర్లకు చక్కగా అనుకూలిస్తుంది. ఇక్కడ అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్‌ 16 , జడేజా 9 తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మొదట బ్యాటింగ్‌కు సహకరించినప్పటికీ ఆట సాగుతున్నా కొద్దీ బంతి ఎక్కువగా తిరుగుతుంది. ఇక్కడ రెండు టెస్టులాడిన టీమ్‌ఇండియా.. 2016లో ఇంగ్లాండ్‌పై 246, 2019లో దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో గెలిచింది. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టమవుతుంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపొచ్చు.

Tags:    

Similar News