కాలసర్పం యోగమా? దోషమా?

Update: 2019-08-06 12:22 GMT

రాహు కేతువులు ఇచ్చే ఫలితాలు అందరూ అనుభవించక తప్పదంటారు జ్యోతిషపండితులు. మన పురాణ ఇతిహాసాలలో కానీ... సరస్వతి పుత్రులైన ఉద్దండ జ్యోతిష రుషిపుంగవులు చెప్పిన విషయాలు వాస్తవమా? కాదా? అన్న మీమాంస ఇప్పుడు ప్రజల మెదళ్లను తొలిచేస్తుంది. రాహు కేతువులు ఏ జాతకుడికైనా ఉచ్ఛస్థితి ఇచ్చినా దానితో పాటు తీవ్ర మనో వ్యాకులత, ప్రాణనష్టం, రాజ్యభ్రష్టత్వం, భేదం, అవమానాలు ఇవ్వక తప్పదంటున్నాయ్‌ ఇతిహాసాలు. ఇప్పుడు ఇదే ప్రజలను భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయ్‌. అంతెందుకు మహాభారత, రామాయణాలలో పుణ్య పురుషులు కూడా అతి దీనంగా దుఃఖించి, కొన్ని సమయాలలో హేయమైన జీవితం గడిపడం కాలసర్ప దోష ఫలితమే అంటారు పండితులు.

సర్పదోషం వేరు. కాలసర్పదోషం వేరు. కాలసర్పదోషానికి పాములకు ఏరకమైన సంబంధం లేదు. ఉండదు కూడా. కేవలం పేరులో సర్పం ఉన్నంత మాత్రాన కాలసర్ప దోషం పాముల వల్ల వస్తుందని అనుకోవటం కరక్ట్ కాదు. కాల సర్ప దోషం వ్యక్తిగత జ్యోతిషం కంటే కూడా దేశాల జాతకాల మీద ప్రభావం ఎక్కువ ఉంటుందనేది వాస్తవం. జాతకంలో దోషాలు ఉండడం మాములే. అలాగే ప్రతి దోషానికి నివారణ ఉపాయాలు కూడా ఉంటాయ్‌. కాలసర్పదోషం జాతకంలో రాహు కేతువుల వల్ల ఏర్పడుతుందనేది కాస్త జ్యోతిష పరిజ్ఞానం ఉన్న వారెవరికైనా అర్థం అవుతుంది. అంటే జాతకంలో ఏడు గ్రహాలు రాహు కేతువుల మధ్యలో ఉండిపోవడమే కాలసర్పదోషం అని తేలికగా గుర్తుపట్టవచ్చన్నమాట.

జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా అవి ఫలితాలు ఇవ్వకపోవడం వెనుకున్న కారణం... ఆ యోగాల్ని కాల సర్పం మింగేయడమే. వివాహం, సంతానం, దాంపత్యంలో అన్యోన్యత, వృత్తి, ఉద్యోగంలో ఉన్నతి ఇతరత్రా వాటికి ప్రధాన అవరోధంగా మారడం కాలసర్పదోష ఫలితమే. జ్యోతిష వాక్కు ప్రకారం.. పండితులు మాట ప్రకారం... కాలసర్ప దోషం వంశపారంపర్యంగా వస్తుందంటారు. కానీ చాలామంది అనుకునేది ఒకటుంది. సర్పాలను చంపడం వల్లనే కాలసర్ప దోషం పడుతుందని. కొంత నిజమే అయినా ఇందుకు చాలా కారణాలే చెబుతారు పండితులు. సర్పాలను తెలిసి గానీ తెలియక గానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అపకారం చేయటం లేదా చంపడం చేసినా.. దోషం వదలదు అని నిర్ణయ కౌముది చెబుతుంది. పీడించినా... హింసించినా... బంధించినా... సంహరించినా... ఆ పాపం సర్ప దోషం రూపంలో మనుషుల్ని పట్టి పీడిస్తుంది.

వంశ క్షయానికి సర్ప దోషమే ముఖ్య కారణం. అంతేకాదు.. గురువులు, ముసలి వాళ్లు, పిల్లలు, స్త్రీలు, గోవులు పశుపక్షులు, పిల్లుల పట్ల మనం చేసే అపరాధం కూడా ఈ దోషం రూపంలో పీడిస్తుంది. అంటే ధర్మ హీనమైన హింసా ప్రవృత్తితో ఇతర జీవాలపై మనం చేసే సమస్త కర్మలు సర్ప శాప స్థితి ద్వారా అమలవుతాయని అంటారు. కర్త అంటే చేసేవాడు, కర్మ అంటే ఫలితానికి కారణమైన వాడు, ప్రేరక అంటే ప్రేరేపించినవాడు.... అనుమోదక అంటే ఆమోదించినవాడు... ఇలా ఈ నలుగురు పాపం అయినా పుణ్యం అయినా సమానంగా అనుభవిస్తారట.

వాస్తవానికి కాలసర్ప దోషం గురించి....ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథాలైన బృహజ్జాతకంలో ఎక్కడా వివరించలేదు. కాని దీనికి విపరీతమైన ప్రాచుర్యం లభించింది. కానీ కాల సర్ప దోషం గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్న పండితులూ ఉన్నారు. కాకపోతే కాలసర్ప యోగ ప్రభావం వల్ల అభివృద్ధి ఎంత వేగంగా ఉంటుందో తిరోగమనం కూడా అంటే వేగంగా ఉంటుందనేది మాత్రం కాదనలేని వాస్తవం. జాతకంలో ఉన్న యోగాలు మన కర్మ ఫలాలు మాత్రమే. ఈ యోగాలను మార్చే శక్తి మన కర్మలకు మాత్రమే ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించే కష్ట సుఖాలు గత జన్మలో మనం చేసుకొన్న కర్మ ఫలాలని పండితులు చెబుతుంటారు.  

Tags:    

Similar News