Vinayaka Chavithi 2023: వినాయక నిమజ్జనం వెనుక ఉన్న అసలు కథ ఇదే.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Vinayaka Chavithi 2023: హిందూ పండుగలలో వినాయక చవితికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు.
Vinayaka Chavithi 2023: హిందూ పండుగలలో వినాయక చవితికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. పదో రోజున పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. అయితే గణేశ్ నిమజ్జనం వెనుక రకరకాల స్టోరీలు వినిపిస్తాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉందో ఎవ్వరికి తెలియదు. కానీ ప్రకృతిలో జరిగే మార్పులకు, వినాయక నిమజ్జనానికి గల సంబంధం గురించి మాత్రం ఈ రోజు తెలుసుకుందాం.
వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ఎండాకాలపు వేడికి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని , పచ్చదనాన్ని కలిగి ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి రోజున వినాయకుడిని ప్రతిష్టించుకొని తొమ్మిది లేదా పదకొండు రోజుల తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. దీనివల్ల భూమి వేడితాపం నుంచి చల్లబడుతుంది. వాతావరణం నిలకడగా ఉంటుంది.
వినాయకుడి నిమజ్జనం వెనుక శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది. భక్తుల మాటలను వినడానికి భూమిపైకి వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపించడానికి దగ్గరి దారి సముద్రమే కనుక వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలని ఉపయోగించడం లో కూడా ఒక నిజం దాగి ఉంది. వర్షాల కారణంగా సరస్సులు, కొలనులు అన్ని బురద పూడికతో నిండి ఉంటాయి. ఒండ్రు మట్టి కోసం జలాశయంలో మట్టిని తీయడంవల్ల పూడిక తీసినట్లు అవుతుంది. ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలు నీటిలో కలవడం వల్ల అందులో ఉన్నటువంటి క్రిమికీటకాలు తొలగిపోయి నీరు శుద్ధి అవుతాయి.
కానీ నేటి రోజుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించి విగ్రహాల తయారీ చేపట్టడం వల్ల నిమజ్జనం తర్వాత నీరు కలుషితమవుతున్నాయి. చెరువులు, నదులలో ఉండే జలచరాల ఉనికి ప్రమాదంలో పడుతుంది. అంతేకాదు ఈ నీటిని తాగడానికి ఫిల్టర్ చేసినప్పుడు అందులో ఉండే రసాయనాలు పూర్తిగా తొలిగిపోవడం లేదు. ఈ నీటిని తాగడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించి నీటి కాలుష్యాన్ని అరికట్టాలి.