శ్రీనివాసుడి లీలలు తెలుసా... మంగళ రూపం చెప్పే నిజమేంటి?

Update: 2019-08-07 11:47 GMT

తిరుమల కలియుగ వైకుంఠం. ఇది భక్తజనుల ప్రగాఢ విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువే... శ్రీ వేంకటేశ్వరుడుగా తిరుమల కొండల్లో స్వయంభువుగా అవతరించాడన్నది భవిష్యోత్తర పురాణ కథనం. దేనిని కీర్తిస్తే సకల పాపాలు హరించుకుపోతాయో, దేనికి నమస్కరిస్తే లోకంలోని సకల సౌఖ్యాలు లభ్యమవుతాయో... ఏ పుణ్యక్షేత్ర యాత్ర దేవతలకు కూడా పూజనీయమో అలాంటి మహత్తరమైనదీ, మహా మహిమాన్వితమైనది వేంకటాచలం.

వేంకటేశుని దివ్య మంగళ స్వరూపాన్ని ఎంత చూసినా... ఎంతసేపు అలా చూస్తున్నా తనవి తీరదు. మాటల్లో చెప్పలేని అనుభూతితో భక్తులు పులకించిపోతారు. పాదాది మూర్తపర్యంతం చూస్తూ అలా ఉండిపోతారు. గర్భగుడిలోకి ప్రవేశించిన నాటి నుంచే భక్తుల మది ఉప్పొంగుతుంది. వేంకటేశుని నామస్మరణతో మార్మోగుతుంది. నిజమే ఆ రూపంలో అంత మహత్యం ఉంది. ఆ నిలువెత్తు విగ్రహంలో అంత మహిమ ఉంది. అందుకే భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి తేలుతారు...

కోట్లాది మంది క్షణకాలం దర్శనం కోసం పడిగాపులు కాస్తున్న శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపంపై ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. స్వామి విగ్రహం నుంచీ... నామం... గడ్డంపై పచ్చకర్పూరం... మొత్తంగా శ్రీవారి ముఖారవిందం... ఇలా దేనికదే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఇంతకూ స్వామి వారి గడ్డంపై పచ్చకర్పూరాన్ని ఎందుకు పెడతారు? అందులో ఉన్న రహస్యమేమిటి? పౌరాణిక గాథ ప్రకారం స్వామి వారికి కలిగిన గాయం కనపడకుండా దాచేందుకే పచ్చకర్పూరాన్ని పెడతారా? ఇందులో నిజంగానే దేవరహస్యం దాగి ఉందంటారు భక్తులు. పాల కడలిలో శేష తల్పంపై పవళించే పరమాత్ముడు కలియుగ వరదుడిగా అవతరించడానికి ముందు జరిగిన కథ... కథ కాదనే వారున్నారు. పౌరాణిక గాథ ప్రచారంలో ఉందనీ, ప్రాచుర్యంలో ఉందనీ చెబుతుంటారు. శ్రీహరి.. సిరిని వెతుక్కుంటూ భూలోకానికి రావడమే అసలుసిసలు కథ అంటారు. దీనిపై అనేక మంది అనేక రకాలైన రచనలు చేపట్టారు. ఇదే ఇతిహాసంగా చిత్రాలూ వచ్చాయి. 

Tags:    

Similar News