దసరా సెలవులు ముగియడంతో తిరుమలలో తగ్గిన భక్తుల తాకిడి
♦ తిరుమల లో కొద్దిగా తగ్గిన భక్తుల రద్దీ ♦ శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)
పుణ్యక్షేత్రమైన తిరుమలలో గత పది రోజులుగా విపరీతంగా ఉన్న భక్తుల రద్దీ నేటికీ తగ్గింది... దసరా సెలవులు, తమిళులు పవిత్రంగా భావించే పెరటాసి మాసం కలిసి రావడంతో అనూహ్య సంఖ్యలో భక్తులు గడిచిన పది రోజుల్లో తిరుమలకు చేరుకున్నారు. దాంతో 20 నుంచి 24 గంటల సమయం భక్తులు వేచి వుండి శ్రీవారిని దర్శించుకున్నారు.
కాగా దసరా సెలవులు ముగిసి స్కూళ్లు, కళాశాల తెరవడంతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయికి చేరింది.. దీంతో ఇవాళ శ్రీవారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకునే భక్తులకు 8 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనం ద్వారా దర్శించుకునే వారికి 3 గంటలు, కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ నమోదుతో తిరుపతిలో కేటాయించే టైంస్లాట్ దర్శనం టోకన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
నిన్నటి రోజు బుధవారం శ్రీవారిని 78,311 మంది భక్తులు దర్శించుకున్నారు, వారు సమర్పించిన కానుకలతో నిన్న శ్రీవారికి రూ 3.73 కోట్లు ఆదాయం వచ్చింది.