ఆనంద నిలయం... అసలు రహస్యం

Update: 2019-08-07 11:44 GMT

భక్తుల పాలిట అదో ఆనంద నిలయం.. ఆ పవిత్ర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఓ తీయని ఆధ్యాత్మిక భావన భక్తులను భక్తిభావంలో ముంచెత్తుతుంది. కలియుగ వరదుడి దర్శనం అయ్యేంత వరకూ ఓ పవిత్రమైన అనుభూతి మనసంతా నిండిపోతుంది. సప్తగిరుల మధ్య కొలువై వున్న వేంకటేశ్వరుని మహిమ అంత గొప్పది కనుకనే ఏడుకొండలు ఎక్కి భక్తులు... వెల్లువలా తరలివస్తారు... స్వామి సేవలో తరిస్తారు. అలాంటి స్వామి మహిమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే. కానీ తిరుమల గురించి కొన్ని నిజాలు... భక్తులు జనులు తెలుసుకోవాలి. భక్తుల వాడుకలో ఉన్నదేమిటి? అసలు వాస్తవాలేమిటి? అసలు రహస్యాలు ఏమిటి? అర్చకస్వాముల అభిప్రాయాలు ఏమిటి? ఇదవన్నీ ప్రచారాలేనా? ఊహాజనితాలా? ఇంతకూ అసలు నిజాలేమిటి?

వేంకటాద్రి సమ స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అంటే ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. ఆ శ్రీనివాసునికి సాటి రాగల దేవుడు భూత కాలంలో లేడు, భవిష్యత్తు కాలంలోనూ ఉండబోడని అర్థం. ఆ ప్రశస్తికి నిలువెత్తు నిదర్శనం ఈ ఏడుకొండలు. శ్రీనివాసుడి దర్శనభాగ్యం మాత్రాన్నే భక్తుల్లో నిండుకొచ్చే భక్తిభావం... అది మాటలకందదు. స్మరణాత్సర్వ పాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్... దర్శనాన్మక్తిదం చేశం శ్రీనివాసం భజేన్నిశమ్... అంటారు. అంటే ఆ దేవదేవుడిని స్మరిస్తే చాలట పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఆ లక్ష్మీవల్లభుడిని కీర్తిస్తే చాలట మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయట. ఆ కమలనాభుడిని కనులారా దర్శిస్తే చాలట.... మోక్షప్రాప్తి సిద్ధిస్తుందట. ఓం నమో వేంకటేశాయ నమ: అని మనసులో తలుచుకుంటే చాలట... ఏడేడు జన్మల్లో చేసిన పాపాలు మనల్ని అంటవట.

అంతటి మహత్యమున్న ఏడుకొండలు... ఈ సప్తిగిరులు... ఈ తిరుమల క్షేత్రం... ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఇంతటి మహత్తు కలిగిన దేవదేవుడు... కలియుగ వరదుడు... శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరుడు భూమండలంలో ఉండదు. అందుకే నారాయణుడి నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనమ్ అంటుంది భాగవతం. కలియుగంలో శ్రీహరి సంకీర్తనతో సర్వ పాపాలు నశించిపోతాయి. అందుకే కలౌ సంకీర్త్య కేశవమ్ అని అన్నారు. యజ్ఞయాగాది క్రతువులకు కలియుగంలో ప్రాధాన్యం లేదు... నిర్మలమైన హృదయంతో ఆ సప్తగిరీశుడిని నోరార కీర్తించగలిగితే చాలు. అందుకే పద కవితా పితామహుడు, వాగ్గేయకారుడు... వేంకటేశ్వరుని వేలమార్లు జపించాడు. వేనోళ్ల కీర్తించాడు. అన్ని మంత్రముల సారం ఏడుకొండల్లోనే ఉందని చాటి చెప్పాడు. పరబ్రహ్మ మంత్రమైన వేంకటేశ్వరుడి మంత్రాన్ని జపించాడు... కలియుగ వరుదుడిని కంటి నిండా చూసి తరించాడు. ఆ వేంకటేశ్వర మంత్రాన్ని సంకీర్తనలో గానం చేయడంలో అంత బలముంది. అంతటి మహత్తు ఉంది.

పాపాలను నశింపజేయువాడే.. వేంకటేశుడు. వెంకటాద్రిపై కొలువైన ఈ దేవదేవుడు... వేం అంటే పాపాలను, కట అంటే నాశనం చేసేవాడని చెబుతారు. అందుకే దానికి వెంకటాద్రి అన్న పేరు సార్థకమైందని చెబుతుంటారు. అందుకే వేంకటాచలం పరమ పవిత్రమైన పుణ్యస్థలం. తిరుమల కొండ అంత సామాన్యమైనదేమీ కాదు... ఆ ఏడుకొండలకు, వేంకటేశునికి తెలియని బంధం ఉంది. ఒక్కోయుగంలో ఒక్కో పేరుతో పిలవబడుతున్న ఈ కొండను త్రేతాయుగంలో అంజనాచలమని, కృతయుగంలో వృషాచలమని, కలియుగంలో వేంకటాచలమని కొలుస్తున్నారు. యుగాలు మారిన కొండ మాత్రం తరగలేదు. ఎందుకంటే వేంకటాద్రి వేంకటశుని క్రీడా స్థలం. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం.

Tags:    

Similar News