ఆదిశేషుడి అవతారం... తిరుమల శిరోభాగం

Update: 2019-08-20 15:36 GMT

ఆదిశేషుని అవతారంగా వెలసిన తిరుమల పర్వత శ్రేణి శిరోభాగం వెంకటాద్రి. నడుమ భాగం అహోబిల క్షేత్రం, అధోభాగం శ్రీశైలం. ఈ మూడు దివ్య క్షేత్రాల్లోనూ వెంకటాద్రిపై శ్రీనివాసుడు, అహోబిలంలో నారసింహుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు కొలువై ఉన్నారు. భక్త జనుల సేవలు పొందుతూ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఇంతటి ప్రాముఖ్యత పొందిన తిరుమల సముద్రమట్టానికి సుమారు 2820 అడుగుల ఎత్తులో దాదాపు 100 చదరపు మైళ్ళ విస్తారంలో వ్యాపించి ఉంది.

తిరుమల కొండలు... ఏడుకొండలుగాను, సప్తగిరులుగాను ప్రసిద్ధి చెందాయి. వీటినే ఆదిశేషుని ఏడు పడగలుగా చెబుతుంటారు. ఇందులోని తొలి నాలుగు కొండలు చదునైన ప్రదేశాలు. తర్వాత వచ్చే ఐదు, ఆరు కొండలు దట్టమైన లోయల్లో విస్తరించాయి. ఇవి అవ్వాచారికోన ప్రాంతంలో ఉన్నాయి. ఈ కోన దాటితే వచ్చేది ఏడో పర్వతం... వేంకటాద్రి. ఈ వేంకటాద్రిపైనే కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న కలియుగ వరదుడు కొలువై ఉన్నాడు. తిరుమలకు ప్రాచీనకాలంలో వేంగడం అని పేరు. తమిళంలో వడ వేంగడం అని కూడా అంటుంటారు. ఇది తమిళులకు వడగు. ఉత్తర దిశలో ఉంటుంది కాబట్టి... వడగు అంటారు. వడుగు అంటే తమిళంలో వీపు అని అర్ధం. తిరుమలకు చెందిన కొండలనే శేషాచలం, వేదాచలం, గరుడాచలం, అంజనాచలం, వృషాచలం, నారాయణాచలం, వెంకటాచలం అంటారు. నారాయణాచలం తూర్పుకు రెండు మైళ్ళ దూరాన స్వామివారి ఆలయం ఆనంద నిలయం ఉంటుంది.

యుగయుగాల నుంచి ప్రాముఖ్యతను పొందిన ఆనందనిలయం.... అదో ఆనందధామం. ప్రకృతి రమణీయ శోభల మధ్య సర్వాలంకార భూషితుడైన వేంకటేశ్వరుడు స్వయం వ్యక్తంగా వెలసిన పుణ్యక్షేత్రం. కలియుగంలో పాపాలను నశింపజేయడానికి సాక్షాత్తూ మహావిష్ణువే నారాయణుడిగా, శ్రీనివాసుడిగా, అర్చావతార మూర్తి ఏడుకొండల్లో కొలువుదీరాడు. ఆధ్యాత్మిక ఆనంద ధామంగా కొలుస్తున్న వేంకటేశ్వరుని దర్శించాలంటే సహజ ప్రకృతితో పులకించే మనసు ఉండాలి. ఎన్నో పర్వత సానువులు, లోయలు, కొండ కనుమలు, అంబరాల చుంబనాలతో పులకరించే పర్వత శిఖరాలు, శాల వృక్షాలు, శిలా శాసనాలు... ఎన్నో దాటుతూ వేంకటాద్రి పర్వతశ్రేణులు ఎక్కాలి. అదే మోకాళ్ల పర్వతంగా అశేష భక్త జనులు భావిస్తారు. హరినామ సంకీర్తనం చేస్తూ ఆనంద తాండవం చేస్తారు. సాగిలపడిన భక్తుల జ్ఞాపకాలు, చలివేంద్రాలు, గుహలు, గృహాంతరాలు, పచ్చికబయళ్ళు, ఏనుగల ఘీంకారాలు, మృగరాజుల విహారాలు, నెమళ్లు, లేళ్ళ సవ్వళ్ళు, మేఘాల పలకరింపులు, సాధువుల ధ్యానాలు... ఇలా వేటికవే వేంకటేశుని భక్తుల్ని స్వాగతిస్తుంటాయి.

Tags:    

Similar News