భారతదేశం అధునాతనమైన తంత్రవిద్యలకు ఆలవాలం. సొంత లాభం కోసం.. స్వార్థ ప్రయోజనాల కోసమే తంత్రమన్న వాదన బలంగా ఉన్న సమాజంలో.... తాంత్రికశాస్త్రం చెబుతున్న నిజమేంటి. తంత్రవిద్య అనగానే ప్రతికూల ప్రభావం చూపేదిగా ప్రాచుర్యంలో ఉన్న ఈ శాస్త్రం. తాంత్రికంలోని నిగూఢశక్తిని ఉపయోగించి మనిషిని ప్రభావితం చేయవచ్చా? సమాజాన్ని శాసించవచ్చా? యోగ సంప్రదాయంలో తంత్ర విద్యలను ప్రయోగించారని శాస్త్రం చెబుతోంది. డబ్బు మీద, అధికారం మీద వ్యామోహం వదులుకోలేని వారే తంత్ర సాధన చేస్తారనీ, తాంత్రిక పూజలు చేసే వారిని, వాటిని సాధన చేసే వారిని ఆశ్రయిస్తారన్న అభిప్రాయం సాధారణం వినిపించేదే.
అందుకే తంత్ర విద్య ప్రతికూలమైనదన్న వాదన కూడా ఉంది. తంత్రశాస్త్రాన్ని, అందులోని రహస్యాన్ని, ఆ విద్యను దురుపయోగం చేయడం వల్ల దానికి ఆ అపఖ్యాతి వచ్చింది. తంత్ర విద్య ముఖ్యంగా ఒక సాంకేతికతగా చెబుతారు పండితులు. ఏ శాస్త్రం గాని, సాంకేతిక నైపుణ్యం గాని దానంతట అది చెడ్డది కాదన్న వాదన ఉంది కూడా. సరిగ్గా తంత్ర విద్యలో జరిగింది అదే. తమ సొంత లాభానికి చాలా మంది ఈ విద్యల్ని దురుపయోగం చేశారన్న ప్రచారం బాగా ఉంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో తంత్ర విద్యలను నిషేధించారు.
వాస్తవానికి తంత్ర శాస్త్రాన్ని శక్తి ఉపాసన శాస్త్రమని చెబుతారు. ఉపనిషత్తులు సిద్ధంతమే తంత్రశాస్త్రమన్న వారూ ఉన్నారు. శక్తిని ఆధారిత తంత్ర శాస్త్రం... సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆపవాదును మూటగట్టుకుంది. ఆత్మ జ్ఞాన గ్రంథాలు రహస్య గ్రంథాలన్న పెద్దల మాట ప్రకారం... తంత్ర శాస్త్రమును రహస్య భాషలో రాయడంతో ఈ అభిప్రాయం పాతుకుపోయిందన్న వాదనా ఉంది. తాంత్రిక శాస్త్రాన్ని సంధ్యా భాష అంటారు. సంధ్య అంటే చీకటి, వెలుగుల మధ్య సంధికాలం. అలాగే సంధ్యా భాషకు రెండర్ధాలు ఉంటాయని చెబుతారు పండితులు. తెలిసిన వారు చదివితే ఒకలా... తెలియని వారు చదివితే ఒకలా అర్థమయ్యేదే తాంత్రిక శాస్త్రం. మహానిర్వాణ తంత్ర శాస్త్రాన్ని సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి కైలాసంలో చెప్పాడని చెబుతారు వేదాంతులు.
తంత్ర శాస్త్రం సాధనా గ్రంథమే. తంత్రానికి ఉపాయమన్న పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది. త్ర అంటే తరింపజేయు జ్ఞానమని అర్థం. తరింపజేసే జ్ఞానాన్ని విస్తరించి చెప్పినదే తంత్రశాస్త్రమన్నది ఒక వాదన. తంత్రశాస్త్రులో శక్తి అంటే స్త్రీ ఆరాధనే ముఖ్యం. అందుకే కాళికా, దుర్గా ఆరాధనలతో తంత్రశాస్త్రాన్ని ఔపాసన పట్టిన వాళ్లు ఎందరో కనిపిస్తారు. అందుకే తంత్ర సిద్ధికి సాధనలు మంత్ర యంత్ర పూజలను ప్రామాణికంగా తీసుకుంటారు. అందుకే కనక దుర్గమ్మ సన్నిధిలో అమ్మ రౌద్ర రూపాన్ని తంత్ర పూజలతో తట్టి లేపారన్న ప్రచారం జరుగుతుందిప్పుడు. సాక్షాత్తూ ఆది శంకరాచార్యులే దుర్గమ్మను రౌద్ర రూపం నుంచి శాంతి రూపంగా మార్చినా.. కొందరు మాత్రం స్వలాభం కోసం తంత్రంతో అమ్మవారి శక్తిని ప్రభావితం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చల్లని చూపులతో భక్తులను కరుణించే దుర్గమ్మ సన్నిధిలో సంప్రదాయానికి విరుద్ధంగా పూజలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. తాంత్రిక పూజలో నిష్ణాతులైన తాంత్రిక సాధకులను రప్పించి పూజలు చేయించారని చెబుతున్నారు.