తిన్నడు..కన్నప్పగా ఎలా మారాడు?

జగమంతా అయన స్వరూపమే అంటారు. భక్త జన కోరికలు తీర్చే కొంగుబంగారమని విశ్వసిస్తారు.

Update: 2020-01-07 03:04 GMT
ప్రతీకాత్మక చిత్రం

జగమంతా అయన స్వరూపమే అంటారు. భక్త జన కోరికలు తీర్చే కొంగుబంగారమని విశ్వసిస్తారు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నమ్ముతారు. ఆయనే బోళాశంకరుడు. అభిషేక ప్రియుడు.. సమస్త జగానికీ సృష్టి స్థితి లయకారుడు ఆ పరమశివుడే అని భక్త జనకోటి మొక్కుతారు.

ఇంతటి మహిమాన్వితుడిని కొలిచే వారిలో ఒక్కడైన భక్తుడు భక్త కన్నప్ప. పూర్వాశ్రమంలో తిన్నడు అని పిలవబడే బోయవాడు. కన్నప్ప ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ‌్యక్షేత్రం శ్రీకాలహస్తి ఆ పరిసర ప్రాంత అడవుల్లో సంచరించే వాడు. మూగ జీవాలను వేటాడి తనజీవనం సాగించేవాడు. ప్రతి రోజు లాగానే ఒక రోజు వేటాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో అతనికి ఒక చోట శివలింగం కనిపించింది. దాంతో అప్పటి నుంచీ కన్నప్ప ఆ అభిషేక ప్రియునికి నిత్యం అభిషేకం చేయడం ప్రారంభించాడు. ఆ గరళకంఠున్ని అలంకరించే ఎంతో అందంగా అలంకరించే వాడు. ప్రతి నిత్యం ధూప దీపాలతో పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు. ముఖ్యంగా ఆ నైవేద్యంలో తాను అడవిలో వేటాడి తెచ్చిన మాంసాన్ని పెడుతుండేవాడు. అలా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అభిషేక ప్రియున్ని కొలిచేవాడు.

అదే దశలో ఆ లయకారుడు తిన్నడి భక్తి శ్రద్ధలను పరీక్షించ దలచాడు. ప్రతి నిత్యంలాగానే కన్నప్ప నైవేద్యం, గంగాజలంతో పూజ చేయడానికి వచ్చాడు. అప్పుడు ఆ శివయ్య తన కంటినుంచి రక్తపు నీరు కార్చడం మొదలు పెట్టాడు. అది గమనించిన తిన్నడు కంటిని తుడవడం ప్రారంభించాడు. ఎన్ని సార్లు తుడిచినా విగ్రహం కంటినుంచి నీరు కారడం ఆగలేదు. ఆ వైపరిత్యాన్ని చూసి భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు.

అప్పుడు ఆ కంటినుంచి నీరు కారడం ఆగిపోయింది. తరువాత వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. దాన్ని కూడా ఎన్ని సార్లు తుడిచినా నీరు కారడం ఆగలేదు. దాంతో ఏం చేయాలో తెలియని తిన్నడు తన కాలి బొటన వేలుతో శివలింగం రెండో కంటి మీద గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి వెంటనే ప్రత్యక్షమయి ముక్తిని ప్రసాదించాడు. తన కన్నులని ఆ శివయ్యకి పెట్టినందుకే తిన్నడికి కన్నప్ప అని పేరు వచ్చింది.   

Tags:    

Similar News