వీణాపాణియై హంసవాహనంపై స‌ర‌స్వ‌తిమూర్తిగా భక్తులను అనుగ్రహించిన శ్రీవేంకటేశ్వరుడు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో వీణ ధ‌రించి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Update: 2019-10-02 03:08 GMT

(తిరుమల, హెచ్ ఎం టీవీ ప్రతినిధి)

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో వీణ ధ‌రించి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

కాగా, బ్రహ్మోత్సవాలలో మూడవరోజైన బుధ‌వారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు సింహవాహనం, రాత్రి 8 నుండి 10 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ఊరేగనున్నారు.

Tags:    

Similar News