శ్రీనివాసుడికి నైవేద్యం.. కుమ్మరి భీముడి పెరుగన్నం!!

Update: 2019-08-08 07:36 GMT

సర్వ దేవతా చక్రవర్తిగా, అసామాన భక్తజనులకు అరాధ్యదైవంగా... కొలవబడుతున్న కోనేటిరాయుడికి పెట్టే మొట్టమొదటి నైవేద్యం ఏమిటి? బంగారు పాత్రల్లో అర్చకులు పెట్టే పంచభక్ష పరమాన్నం కంటే.. మట్టి మూకుడులో పెట్టే ప్రసాదాన్నే శ్రీవారు ఇష్టంగా స్వీకరిస్తారట. ఆసక్తిగా ఉంది కదూ. ఆ మట్టి మూకుడు కథేమిటో తెలుసుకోవాలంటే పౌరాణిక గాథలోకి వెళ్లాల్సిందే.

వెంకట్రాది క్రీడాస్థలంగా వేంకటేశుడు చూపించిన లీలా విశేషాలు అనంతం. ఆకాశరాజును కూతురైన పద్మావతిని పెళ్లాడిన శ్రీనివాసుడికి తోండమాన్‌ చక్రవర్తి బావమరిది. ఏడుకొండలపై కొలువైన కోనేటి రాయుడికి అత్యంత ప్రియమైన భక్తుడు. తోండమాన్‌ కూడా తిరుమలేశుడిని నిత్యం కొలిచేవాడు... ఆర్తితో ఆరాధించేవాడు. శ్రీవిభుడు కూడా తోండమాన్‌తో మాట్లాడేవాడన్నది ఓ ప్రతీతి. తిరుమల విభుడికి నిత్యం బంగారు తులసీదళాలు సమర్పించేవాడట. అలా తోండమాన్‌ చక్రవర్తికి అహం ఆవరించింది. అలాంటి తోండమానుడికి గుణపాఠం చెప్పే సమయం కోసం వేంకటేశుడు చూస్తున్నాడట. ఒకరోజు శ్రీవారి దగ్గరకు వెళ్లిన తొండమానుడు.... నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు ఎవరుంటారు... ఉండలేడు కదా...? అని ప్రశ్నించాడట. నాకు ప్రియాతిప్రియమైన, కుమ్మరివాడైన భీముడు అనే భక్తుడు ఏడుకొండలకు దగ్గర్లోనే ఉన్నాడని చెప్పాడట. అలా స్వామి వారి పాదాల కింద ఉన్న తులసీదళాలను శుభ్రం చేస్తుండగా, తాను చేయించిన బంగారు తులసి దళాల కింద మట్టి తులసీ దళాలు కనిపించాయుట. అప్పుడు శ్రీవారు ఈ మట్టి దళాలు ఇచ్చింది నా భక్తుడైన భీముడేనని చెప్పాడట.

ఇక శ్రీవారి అన్నప్రసాదంపైనా కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. తనకు ప్రియమైన భక్తుడు భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడట. ఇది సాక్షాత్తూ మూలవిరాట్టు విగ్రహానికి సమర్పించింది కాదు.. భీముడి దగ్గర ఉన్న ఓ కొయ్య వెంకటేశుడి విగ్రహానికి అన్నాన్ని ప్రసాదంగా సమర్పించేవాడట. అలా భీముడి భక్తికి పొంగిపోయిన స్వామి వారు శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానంలోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారట. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్ని భీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. కలియుగ వరుదుడు అదొక్కటే తింటారన్నది ఇప్పటికీ చెబుతుంటారు. 

Tags:    

Similar News