శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ. కానీ, గోవిందుడి కొడుకులు ఎవరు? ఎంతమంది ఉన్నారన్న అనుమానం కలుగుతుంది. మథురనిచేరి కంసుని చంపిన దేవదేవుడు తరువాత దేవకీ, వసుదేవుల చెంత వుంటూ వారిని అనుగ్రహించాడు. ఈ సందర్భంలో ఆయన అనేక వివాహాలు చేసుకున్నాడు. ప్రధానంగా ఎనిమిది మంది భార్యలు ఆయనకు అష్ట మహిషులుగాప్రసిద్ధి పొందారు! శ్రీకృష్ణ పత్నులైన ఆ ఎనిమిది మంది... లక్ష్మీదేవీ అవతారమైన రుక్మిణీ మాత, సత్రాజిత్తు తనయ అయిన సత్యభామ, శ్రీరాముని బంటైన జాంబవంతుని పుత్రిక జాంబవతి, అలాగే, వివిధ రాజ్యాల రాకుమార్తెలైన నాగ్నజితీ, భద్ర, మిత్రవింద, కాళింది, లక్షణ. ఈ ఎనిమిది మందితోనూ శ్రీకృష్ణ పరమాత్మకి పదేసి మంది కొడుకులున్నారని చెబుతోంది భాగవత పురాణం! అంటే, మొత్తం ఎనభై మంది తనయులున్నమాట!
గోపాలబాలుడి కులంలో పుట్టిన ఆయన వంశోద్ధారాకుల్లో అందరూ ప్రాముఖ్యత వహించలేదు. అయితే, రుక్మిణీ దేవీ కుమారుడైన ప్రద్యుమ్నుడు మహా సుందరుడు, వీరుడు. ఆయన సాక్షాత్తూ రతీదేవీ భర్త అయిన మన్మథుడు. శివుడికి తపోభంగం చేసిన కారణాన ఆయన రూపం నశించి పోగా.. రుక్మిణీ దేవీ గర్భంలో జన్మించి తిరిగి రూపం పొందాడు ప్రద్యుమ్నుడుగా! రుక్మిణీదేవీకి ప్రద్యుమ్నుడు కాక మరో తొమ్మిది మంది పుత్రులున్నారు. అలాగే, సత్యభామకి భాను, సుభాను, స్వర్భాను అంటూ పది ముంది భాను పేరుగల పుత్రులున్నారు. ఇక మరో ప్రధానమైన కృష్ణుడి పత్ని అయిన జాంబవతి కుమారుడు సాంబుడు. ఈయన కురుక్షేత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాటం చేసి చివరకు ప్రాణాలతో నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో మరణించని అతి కొద్దిమందిలో జాంబవతి, శ్రీకృష్ణుల కుమారుడైన సాంబుడు కూడా ఒకరు! ఈయన కాక మరో తొమ్మిది మంది సంతానం జాంబవతికి వున్నారు.
రుక్మిణీ, సత్యభామ, జాంబవతి లాగే ఇతర శ్రీకృష్ణ పట్టపు రాణులకు కూడా అనేక మందిపుత్రులున్నారు. వీళ్లే కాక అనంతమైన శక్తి కలిగిన ఆ స్వామికి నరకాసురవధ అనంతరం 16,108మంది స్త్రీలని పెళ్లాడవలసివచ్చింది. వారంతా నరకాసురుని బంధీలుగా మగ్గిపోయిన వారు! వారి ద్వారాకూడా శ్రీకృష్ణునికి ఎందరో సంతానం కలిగారు. అయితే, వాళ్లలో అందరూ కలియుగ ప్రారంభసమయంలో మురళీ మోహనుని అవతార సమాప్తి తరువాత అంతమైపోయారు. శ్రీకృష్ణ, బలరాముల వంశంలో అంతః కలహాలు పెల్లుబికి ఒకరినొకరు కొట్టుకుని చంపుకున్నారు! అలా కృష్ణుని సంతానం ఏదీ మిగలలేదు. రుక్మిణీ, శ్రీకృష్ణ పరమాత్మల తనయుడైన ప్రద్యుమ్నుడికి మాత్రం అనిరుద్ధుడనే కొడుకు కలిగాడు. ఆయన మాత్రం కృష్ణ వంశాన్ని కొనసాగించాడు!