సప్త రుషులు... వారసత్వ మూల పురుషులు

Update: 2019-08-28 04:33 GMT

సప్తర్షులు అంటే సప్త రుషులు.. వీరి గురించి అతి పురాతనమైన బ్రాహ్మణాలు మొదలు ద్వాపరంలో రచింపబడ్డ భారతం వరకూ అన్ని చోట్లా చెప్పబడింది. అసలు ఈ ఏడుగురు అత్యంత పూర్వులైన ఋషుల వల్లే మనకు గోత్ర సంప్రదాయం లభించింది. మన గోత్రాలు మొట్ట మొదట సప్తర్షుల నుంచే ప్రారంభమయ్యాయి. అంటే, ఒక విధంగా సృష్ట్యాదిలో మనమంతా ఆ ఏడుగురు మూల పురుషుల నుంచే వచ్చామన్నమాట. సప్త ఋషుల పేర్లు ఒక్కోచోట ఒక్కో విధంగా కొంచెం భేదాలతో చెప్పబడ్డాయి. ఎవరి పేరు ఉన్నా ఎవరిది లేకున్నా అందరూ గొప్పవారే. పైగా సప్తర్షి వ్యవస్థ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేది. అందుకే, ప్రతీ మన్వంతరంలో సప్త ఋషులు మారిపోతుంటారు. మన గ్రంథాల్లో ఈ కల్పంలోని మొత్తం పద్నాలుగు మన్వంతరాలకు కూడా సప్తర్షుల జాబితాలు ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం.

ఈ కాలానికి సప్తర్షులు... కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని. వీరంతా ఎవరికి వారే మహోన్నతమైన ఆధ్యాత్మిక జీవులు. కశ్యపుడు నారాయణ అంశ అంటారు. అత్రి దత్తాత్రేయునికే తండ్రి. విశ్వామిత్రుడు పరమ పవిత్రమైన గాయత్రి మహామంత్రాన్ని అందించిన వాడు. ఇక గౌతముడు మన తెలుగు నేలను సస్యశ్యామలం చేసే గోదావరిని భువికి తెచ్చిన వాడు. అందుకే, గోదావరిని గౌతమీ అని కూడా అంటుంటారు. అలాగే, వశిష్ఠుడు సాక్షాత్తూ శ్రీరామచంద్రుల వారికే కుల గురువు. సప్తర్షుల్లో చివరి వాడైన జమదగ్ని రేణుకా దేవీ భర్త, పరశురాముని తండ్రి, మహా తపః సంపన్నుడు.

ఇలా వారు మన సమస్త సంస్కృతికి, నాగరికతకి, అభివృద్ధికి కారకులు. వారిని మనం నిత్యమూ స్మరించి... తరించాలి. వారి ఆదేశాలు, ఆధ్మాత్మిక సూత్రాలు శిరసావహించాలి.

Tags:    

Similar News