ప్రతి మానవుడి అంతిమ లక్ష్యం మోక్షం పొందడమే. పరమాత్మ తేజస్సుసృష్టి ప్రారంభమైనపుడు... ప్రకృతి ప్రభావంతో ఆత్మలుగా ప్రతిబింబించాయి. ఇలా ఉన్న ఆత్మలనే జీవాత్మలని అంటాం. వాస్తవానికి పరమాత్మ ప్రతిబింబమే అలా పదార్థంతో ఏకమైన జీవాత్మ తన నిజమైన ఉనికిని మరచి, దేహాన్నే తానని భ్రమించి, దేహాలను మార్చుకుంటూ గమ్యాన్ని మరిచి తిరుగుతుంది.
ఇలా జీవాత్మ గతి తప్పి తిరగడాన్నే సంసారం అంటారు. అలాంటి జీవాత్మ మానవ జన్మ ఎత్తి తన నిజతత్వాన్ని గురువుల బోధనలతో అర్థం చేసుకొని, భౌతికమైన మానసికమైన బంధాల నుంచి తపోసాధనలతో తెంచుకొని పరమాత్మలో తన ఉనికిని స్థిరం చేసుకోవడాన్నే మోక్షం. ఇలా మోక్షం పొందడము కేవలం వివేకవంతుడైన మనిషికి మాత్రమే సాధ్యం. ఎప్పుడూ ఉనికి కలిగి వుండి తన తత్వమైన పరమ ఆనందాన్ని పొందుతూ ప్రకృతికి అతీతంగా ఉన్నదే పరమాత్మ. ప్రకృతికి అతీతమైన స్థితిని చేరిన ముక్తిపొందిన ఆత్మ తిరిగి జన్మంచదు. కష్టాలపాలు కాదు, నిత్యానందాన్ని శాశ్వతంగా అనుభవిస్తుంది. సర్వవిధ భగవత్ సాధనల పరమ లక్ష్యం జీవాత్మ తన నిజస్థితియైన పరమాత్మ స్థానాన్ని పొందడమే.