మోక్షసాధన సామగ్ర్యాం భక్తిదేవ గరీయసీ అన్న శంకర భగవత్పాదుల మాటను సర్వ భారతీయ సాహిత్యమూ సత్యం చేసింది. భారతీయ సంస్కృతిలో పురుషార్థాల ప్రాముఖ్యం ఎక్కువ. మానవ జీవన వికాసానికి ధర్మార్థ కామ మోక్షాలే ప్రధానం. పురుషార్థాల్లో ప్రధానాంశం ధర్మం. అర్థ కామాలు ధర్మ బద్ధమైనప్పుడే మోక్షమార్గం సులభమౌతుందన్న ఆలోచనతో ఏర్పరిచిన ఈ నియమాల్లో 'మోక్షం' మిక్కిలి శ్రేష్ఠమైనదన్న సత్యం ద్యోతకమవుతూ ఉంది. ధర్మమార్గ ప్రవక్తారో ముక్తా ఏవ నసంశయ అన్నారు వాల్మీకి మహర్షి.
మోక్షానికి పునాది ధర్మమే నన్నది రామాయణం చెప్పిన మాట. అదీ నారద మహర్షి ముఖతః పలికించిన పవిత్ర వచనం. మోక్షమంటే ఏమిటి? అన్నది మౌలికమైన ప్రశ్న. ఒక విధంగా దీనిని ముక్తి అని, కైవల్యమని అనుకోవచ్చు. అనేక బంధనాల్లో చిక్కుకున్న జీవుల విముక్తికి ఎవరికి వారే మార్గం వెతుక్కోవాలి. ఆ అన్వేషణకై వ్యక్తి పూర్వుల మాటలపై విశ్వాసంతో భగవత్తత్వంపై శ్రద్ధతో ప్రయత్నిస్తే ఫలితం హస్తగతం అవుతుంది.
మిగిలిన మూడు పురుషార్థాలకు తాను తన కుటుంబం, సమాజం కూడా తోడుండాలి కాని ఈ పురుషార్థ సాధనలో ప్రతి వ్యక్తీ తనకు తానే ప్రయత్నించాలి. ఆ ప్రయత్న మార్గాలను తెలపాలన్న తపనే పూర్వ మేధావుల అన్వేషణ నుంచి ఆవిర్భవించిన వేదాది గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాదులు మనకు స్పష్టమైన మార్గాన్ని దర్శింపజేస్తున్నాయి.