మనసు పోయిన ప్రతిచోటుకి కళ్ళు పోకూడదు. కళ్ళు వెళ్లినంత మేర మనిషి వెళ్ళకూడదంటారు పెద్దలు. మనసు చాలా చిత్రమైనది. విచిత్రాలు చేయిస్తుంది. మహావిచిత్రాలు విచిత్రమైనది. చంచలమైనది. కోతిలా ఆడుతుంది. మనల్ని ఆడిస్తుంది. ఆట పట్టిస్తుంది, ఆందోళన చేస్తుంది. చేయిస్తుంది అదే కోతిని మనం ఎక్కడ నొక్కాలో ఏ రకంగా తొక్కాలో అక్కడ నొక్క గలిగితే, ఆ రకంగా తొక్కగలిస్తే అది తోక ముడుస్తుంది.
అదంత సులభమా? ఆషామాషీ వ్యవహారమా? కానే కాదు. అదొక యజ్ఞం. అదొక దుర్బేధ్యమైన విషయం. దృఢ చిత్తం, అవిచ్ఛమైన, అవిశ్రాంతమైన అనంతమైన కఠోర సాధన ద్వారానే సాధ్యం అభ్యాసం చేయాలి. ఎంతో కష్టించాలి. ఎన్నో కష్టాలు పడాలి. చిత్తశుద్ధి కావాలి, ఏకాగ్రత ఉండాలి ఏకాగ్రత కుదరాలంటే మనసు శాంతంగా ఉండాలి. దానికి ప్రశాంతత కావాలి. ప్రశాంతత ఉంటేనే శాంతి వచ్చేది. ఒరిగేది కదా? ప్రశాంతత వచ్చేది ఎలా అంటే ధ్యానంతో అంటారు. ధ్యానంతో ప్రశాంతత చేకూరాలంటే.. ధ్యానం చేయాలంటే ప్రశాంతత, శాంతి ఉండాలి కదా అంటారు. మరి కొందరు ఇలా- చర్చించుకుంటూపోతే విత్తుముందా చెట్టుముందా అనేలా సాగుతుంది వాదన. ఆ వాదనకు అంతం ఉండదు. అనంతంగా సాగుతూనే ఉంటుంది.
ధ్యానం చేసుకోవాలన్నా జపం చేసుకోవాలన్నా ఏకాంతమనేది దానంతట అదిరాదు. ఏకాంతాన్ని మనం తెచ్చుకోవాలి. ఏర్పరచుకోవాలి. ఏర్పాటుచేసుకోవాలి. అభ్యాసంతోనో సాధనతోనో ఏకాంతాన్ని సముపార్జించుకోవాలి. సంపాదించుకోవాలి. జపానికి, ధ్యానానికి కావలసినది ఏకాగ్రత. దృఢ చిత్తం. ఏకాంతం, ఏకాంత ప్రదేశం కాదు. మొక్కవోని దృఢ చిత్తం ఉంటే ఏకాంతం మన స్వంతమవుతుంది. ఏకాంత ప్రదేశం దానంతటదే మనకి మన మనస్సుకి సిద్ధిస్తుంది. అలవోకగా లభ్యమవుతుంది. మనసు నిర్మలంగా ఉంటే దేనిమీద విపరీతమైన ధ్యాస లేకపోతే కోరికలను నియంత్రించు కోగలగితే చాలు ఏకాగ్రత కలుగుతుంది.