పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగం. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.
అనేక రకాల పుష్పాలతో అభిషేకం చేస్తే రాజభోగాలు, వెండిధూళి లేదా వెండి రజనుతో శివుడిని అభిషేకిస్తే విద్యాప్రాప్తి కలుగుతాయి. నవధాన్యాలతో అభిషేకిస్తే ధనంతోపాటు భార్యాపుత్రలాభం కలుగుతుంది. పటికబెల్లంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉప్పుతో అభిషేకం చేస్తే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదాభిషేకంతో చేసే అభిషకం వల్ల మనకు సర్వకార్యాలు ప్రాప్తిస్తాయి.
బెల్లంతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వెదురు చిగుళ్లతో అభిషేకం చేస్తే వంశవృద్ధి కలుగుతుంది. పాలతో అభిషేకిస్తే కీర్తి, సిరి సంపదలు, సుఖాలు కలుగుతాయి. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో లింగాభిషేకం చేస్తే దారిద్ర్యనాశనమవుతుంది. ఇక వివిధ రకాల పండ్లతో చేసే అభిషేకం వల్ల జయం కలుతుంది.
ఉసిరికాయలతో చేస్తే మోక్షం లభిస్తుంది. సువర్ణం పొడిగా చేసి అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టదాతువులతో చేసే అభిషేకం వల్ల సిద్ధి కలుగుతుంది. మణులు, వాటి పొడులతో అభిషేకిస్తే మనలోని అహంకారం తొలగిపోతుంది. పాదరసంతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ఆవు నెయ్యి, పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయు:వృద్ధి కలుగుతుందని మన పురాణాలు పేర్కొంటున్నాయి.