లోకంలో వివేచన, విచక్షణ కలగలసిన ప్రత్యేక ప్రాణి మనిషి. హృదయస్పందనలతో, మేధస్సు నిండిన మస్తిష్కంతో ప్రాణికోటిలో శ్రేష్ఠుడై వెలుగొందుతున్నాడు. శుభకరమైనదీ, సుఖకరమైనదీ అనే రెండు మార్గాలు మానవుని సమీపిస్తాయి. బుద్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి వివేచిస్తాడు. సుఖం కంటే శ్రేయస్సే మేలని ఎన్నుకొంటాడు. కానీ బుద్ధి హీనుడు లోభాసక్తితో సుఖాన్నే కోరుకుంటాడు. విజ్ఞతకు సంబంధించిన సున్నితమైన ఆలోచన మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఏది శాశ్వతం, ఏది క్షణికం అనే వివేచన, సర్వదా సుఖాల పట్ల విముఖత, మన: ఇంద్రియ నిగ్రహం, ఆనందోల్లాసాలే పరమావధి కాకపోవడం, సహనం, శాంతి, శ్రద్ధ ఆలంబనగా చేసుకోవడం, మోక్షమా ర్గానికి అన్వేషణ సాధ్యం అనుకుంటే పొరపాటు. మాలిన్యం నుండి మనసు ప్రక్షాళన మయితే సత్య గ్రహణం సంభవం అని నిరూపించిన నచికేతుని వృత్తాంతమే కఠోపనిషత్తు రూపంలో భాసిల్లుతుంది.
జీవితరహస్యం మరణం లోనే ఉంది. నిష్ఫాక్షికంగా విచారిస్తే ఆత్మచైతన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ధాన్యం నాటువేయడం, కోతలో రాలిపోవడం తిరిగి అదే బీజంగా మారి మొలకెత్తడం ప్రకృతిలో సహజం. మనిషి కూడా జనన మరణ చక్రాన్ని అనుస రిస్తాడు. మనిషి జన్మ మృత్యువును సూచిస్తుంది. మృత్యువే మనిషి పునర్జన్మను సూచిస్తుంది. అందుకే అనవసరంగా శోకించే పనిలేదు. అలాగని మితిమీరిన ఆనందమే సుఖమని భావించ క్కర్లేదు.
జంతువుల కంటే మనిషి ఆయుష్షు ఎక్కువ కావచ్చు.
మనుషుల కంటే దేవతలు వందల సంవత్సరాలు అధి కంగా జీవించవచ్చు. కల్పాంతమైన బ్రహ్మదేవుని ఆయు: పరిమితి అందరికంటే దీర్ఘమై కొనసాగ వచ్చు. కానీ ఆది అంతం లేని కాలంలో బ్రహ్మ జీవితమైనా ఎంతటి వైభవంతో అలరారు తున్నా జీవితం క్షణికమే, అంటూ జీవిత రహస్యాన్ని విశ్లేషిస్తూ కఠోపనిషత్తు 'ఆత్మ' చైతన్యదిశగా అడుగులు వేయ మంటుంది. కుటిలచిత్తం లేని, జననాది వికారాలు లేని పరబ్రహ్మానికి తొమ్మిది ద్వారాలున్న ఈ దేహమే పట్టణం. హృదయ ధామంలో విరాజిల్లే పరమాత్మను రాగద్వేషాలు లేక తలచేవాడు జనన మరణరూప సంసార బంధం నుండి విముక్తి పొందుతాడు. పరమాత్మ నిత్యనిజరూపమే మానవునిలోని జీవాత్మ. హేతువాదానికి అందనిదీ, నిగూఢమైనదీ ఆత్మ.