హనుమజ్జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న దివ్య క్షేత్రం జై శ్రీ రామ్ నినాదాలతో మారుమోగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంజనేయ భక్తులు కొండగట్టుకు మంగళవారం రాత్రి నుంచే పోటెత్తారు. హనుమజ్జయంతి ని పురస్కరించుకుని మాల ధారణ చేసుకుని, కఠోర దీక్షాబద్ధులైన భక్తులు అంజన్న దర్శనం కోసం వెల్లువెత్తారు. స్వామి సన్నిధిలో మొక్కులు చెల్లించుకుని మాల విరమణ చేస్తున్నారు. ఆలయం చుట్టుపక్కల ఎటుచూసినా భక్తులే కనిపిస్తున్నారు.
కాగా, హనుమజ్జయంతి సందర్బంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. సుమారు 500 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే, మంగళవారం అర్థరాత్రి దాటాకా భక్తులు ఒక్కసారిగా చొచ్చుకుని రావడంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది. మొత్తమ్మీద భక్తులు ప్రశాంతంగా దర్శనమ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.