శ్రీశైలం వెళ్తున్నారా.. ఇష్టకామేశ్వరి దేవి దర్శనం మరిచిపోకండి

Update: 2019-09-05 10:26 GMT

తిరుమల తరువాత అంతటి ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైలం, అంతటి అనుగ్రహం కలిగిన దేవుడు మల్లన్న. ఇక్కడి పర్వతాలపై కొలువైన మల్లన్నను ఒకప్పుడు చుట్టుపక్కల గల గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకునే వారు. ఈ రోజున వివిధ దేశాలను భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ వుంటారు. మల్లన్న నిలయమైన శ్రీ శైలం ... సిద్ధ క్షేత్రం. ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అరణ్యంలో కనిపిస్తూ వుంటాయి. అలాగే ప్రాచీనకాలం నాటి ఆలయాలు కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ వుండటం విశేషం. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైనదిగా 'ఇష్టకామేశ్వరీ ఆలయం' దర్శనమిస్తోంది.

పూర్వం సిద్ధుల పూజలు అందుకున్న 'ఇష్టకామేశ్వరీ దేవి' ... నేడు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తోంది. శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవలసి వుంటుంది. పక్షుల కిలకిలలు ... జంతువుల అరుపులు ... జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన తప్పకుండా కలుగుతుంది.

ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలను కలిగి వుంటుంది. రెండు చేతులలో తామర పుష్పాలను ... మిగతా రెండు చేతుల్లో జపమాల - శివలింగం ధరించి కనిపిస్తుంది. అమ్మవారు నిమ్మకాయల దండలను ధరించి వుంటుంది. ఆ తల్లి నుదురు మెత్తగా ఉంటుందని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటే, తప్పకుండా ఆ కోరికలు నెరవేరతాయని అంటారు. ఇదే విషయం 'ఇష్ట కామేశ్వరీ వ్రతం' లోను కనిపిస్తుంది.

Tags:    

Similar News