శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల రద్దు!

Update: 2019-10-14 02:33 GMT

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయిపోయినా.. ఇప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేంకటేశుని దర్శనానికి భక్తులు పోటెత్తడంతో తిరుమల వీధులన్నీభక్త జన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి సుమారు 26 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి దాదాపు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు పూర్తికావస్తుండడం తొ భక్తుల రద్దీ పెరిగింది. అదేవిధంగా తమిళ క్యాలెండర్ ప్రకారం వారు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇచ్చే పెరటాసి నెల చివరి వారం కావడంతో తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమల లో భక్తుల తాకిడి ఎక్కువైంది.

ఇక తిరుమల కొండపై రద్దీ దృష్ట్యా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లు, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను రద్దు చేసింది. శనివారం ఒక్కరోజే లక్ష మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు స్వామివారికి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారు గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరించారు.


Tags:    

Similar News